చిక్కడపల్లి, అక్టోబర్‌30(ఆంధ్రజ్యోతి): దేశ సామాజిక వాస్తవికతను ‘వాన వెలిశాక ’కవితా సంపుటి రచన ప్రస్ఫుటింపచేసిందని వక్తలు పేర్కొన్నారు. విమల సాహితీ సమితి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి త్యాగరాయగానసభలో ప్రముఖ కవి, విమర్శకుడు, బిక్కి కృష్ణ రచించిన వాన వెలిశాక కవితా సంపుటి ఆవిష్కరణ సభ జరిగింది.ఈ సభలో శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పూర్వ వీసీ ఆచార్య కొలకలూరి ఇనాక్‌, ప్రముఖ కవి, విమర్శకుడు రమణ వెలమకన్ని, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, ప్రముఖ కవుల జీవీ రత్నాకర్‌, మువ్వా శ్రీనివాసరావు, తదితరులు ప్రసంగించారు. ప్రపంచీకరణలో భాగమైన సంస్కరణల పేరుతో ప్రజలను చిందర వందర చేసే విధానాలను ప్రజల బాధల గాథలు ఈ రచనలో చక్కగా విడమర్చి చెప్పారన్నారు. ప్రపంచీకరణ పరిణామాలను  రంగురంగుల సిరాలతో బిక్కి కృష్ణచిత్రీంచారన్నారు. ఈ సంపుటిలో ప్రేమ, స్త్రీపురుష సంబంధాల గురించి కూడా కవితలున్నాయన్నారు.  అద్భుత అనుభూతితో కవితలు రాశారన్నారు. ఈ సమావేశంలో గుదిబండి వెంకటరెడ్డి, యలవర్తి రాజేంద్రప్రసాద్‌, జల్ది విద్యాధరరావు, పెద్దూరి వెంకటదాసు తదితరులు పాల్గొన్నారు.