టీటీడీలో సంగీతానికి ప్రోత్సాహం కరువైంది  - మృదంగ విద్వాంసుడు యల్లా వేంకటేశ్వరరావు

పరిచయం అవసరం లేని సంగీత విద్వన్మణి పద్మశ్రీ యల్లా వేంకటేశ్వరరావు. తన ఏడవ ఏట నుంచే ఆయన మృదంగ సాధనతో విఖ్యాత విద్యాంసులయ్యారు. 70 దేశాల్లో 27 వేల కచేరీలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి, టీటీడీకి ఆస్థాన విద్వాంసులుగా సేవలందించారు. టీటీడీలో ఇటీవల కాలంలో సంగీతం పట్ల ప్రదర్శితమవుతున్న అలక్ష్యాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. కళలకు నిలయమైన ధార్మిక సంస్థలో సంగీతానికి ఎంత అన్యాయం జరుగుతుందో ఆయన ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతితో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే... 

టీటీడీలో సంగీతానికి ప్రోత్సాహం కరువైందంటారా ?

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామికి వేదం ఎంత ముఖ్యమో... నాదం కూడా అంతే ప్రదానం. అందుకే శ్రీవారు వాగ్గేయకారులను తన అక్కున చేర్చుకున్నారు. అయితే గతంలో టీటీడీ సంగీతానికి ఇచ్చినంత ప్రాముఖ్యత ఇప్పుడు ఇవ్వటం లేదు. దేవస్థానంలో  సంగీత వ్యవస్థ ఎంతో లోపభూయిష్టంగా వుంది.

టీటీడీ సంగీత కళాశాలను పెట్టిన లక్ష్యం నెరవేరిందా?

ప్రారంభంలో నెరవేరింది. అప్పట్లో గొప్ప గొప్ప విద్వాంసులు సంగీత విద్యనేర్పేవారు. ఇప్పుడు వారంతా రిటైర్‌ అయ్యారు. అందుకే టీటీడీ సంగీత కళాశాలలో కేవలం డోలు, నాదస్వరం మాత్రమే నేర్చుకునే విద్యార్థులున్నారు. మిగిలిన విభాగాలు గానం, నృత్యం, ఇతర వాయిద్యాల కళలు నిర్వీర్యం అయిపోతున్నాయి. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి ఆయా కోర్సుల్లో చేరటానికి వచ్చిన పిల్లలను గురువులు తమ విద్వత్తుతో ఆకట్టుకోవాలి. వారిలో సంగీతం పట్ల ఆసక్తిని పెంచాలి. నా వద్ద రెండు వేల మంది మృదంగం నేర్చుకున్నారు. విద్యార్థులను ఎలా ఆకట్టుకుని సంగీతం నేర్పాలో తెలుసుకాబట్టి చెపుతున్నా. నిష్ణాతులైన గురువులు లేక పోతే విద్యార్థుల్లో నమ్మకం కలగదు. 

ఇంకా ఏం లోపాలున్నాయి ?
నిష్ణాతులైన వారి నియామకంతో పాటు వేద విద్యార్థులకు ఇస్తున్నట్టే, డోలు సన్నాయి విద్యార్థులకు ఇస్తున్నట్టే సంగీతం నేర్చుకునే విద్యార్థులకూ స్టైఫండ్‌ ఇవ్వాలి. అప్పుడు విద్యార్థుల్లో ఉత్సాహం మరింత పెరుగుతుంది. సంగీత కళాశాలలోనే కాదు... టీటీడీకి చెందిన ఎస్వీబీసీ చానల్‌లో కూడా సంగీతానికిఅన్యాయం జరుగుతోంది.

నాదనీరాజనం ద్వారా న్యాయం జరగడం లేదంటారా ?

నాదనీరాజనం ప్రారంభంలో అంతర్జాతీయ స్థాయి, జాతీయస్థాయి, రాష్ట్రస్థాయి, ఏ గ్రేడ్‌, బి గ్రేడ్‌ అనే గ్రేడింగ్‌లతో గొప్పగొప్పవారితో శ్రీవారి ఆలయం ముందు కచేరీలు చేయించేవారు. ఇందుకోసం ఓ కమిటీ వుండేది. ఇప్పుడు ఆ కమిటీ లేదు. ఓ పద్ధతిలేకుండా ఇష్టానుసారం నాదనీరాజనం నిర్వహిస్తున్నారు. నాలాంటి కళాకారులకు రెండు లక్షల నుంచి అయిదు, పది లక్షలు ప్రైవేటు కచేరీకి ఇస్తారు. టీటీడీ అందరినీ ఒకేగాటిన కట్టి 20, 30 వేల రూపాయలు మాత్రమే పారితోషికం ఇస్తోంది. మాతో పాటు నిష్ణాతులైన టీం వుంటుంది. వారికి కూడా పారితోషికం మేము ఇచ్చుకోవాలి. ప్రయాణం ఖర్చులుంటాయి. నేను నా గురించి అడగటం లేదు. నేను శ్రీవారిపై భక్తితో సొంతంగా ఖర్చులు భరించి వస్తున్నా... గొప్పగొప్ప కళాకారులు శ్రీవారి ఆలయం ముందు తమ కచేరీలు ఇవ్వాలనేది నా సంకల్పం. అప్పుడే ఎస్వీబీసీ వీక్షకులు కూడా సంతోషిస్తారు.

టీటీడీకి ఏం సూచన చేస్తారు?

టీటీడీ ఈవోలు, చైర్మన్లు మీలా గతంలో కూడా మమ్మల్ని ఇలా సూచనలు అడిగేవారు. అలా ఇప్పుడున్న వారు సూచనలు తీసుకోవాలి. అలాగే టీటీడీ ధర్మ ప్రచార పరిషత్తును ఓ కార్ప్‌సఫండ్‌తో పెట్టినట్టే... సంగీత పరిషత్‌ను ఏర్పాటు చేయాలి. సంగీతాన్ని గతంలో ఆల్‌ ఇండియా రేడియో, దూరదర్శన్‌, ప్రభుత్వం ప్రోత్సహించేవి. ఇప్పుడు టీటీడీ మాత్రమే సంగీతాన్ని ప్రోత్సహించి కాపాడగలదు. కాపాడాలి. అందుకు సంగీత పరిషత్‌ ద్వారా మాత్రమే సాధ్యం. చివరగా ఓ మాట ఇటీవల టీటీడీపైన కొందరు విమర్శలు చేశారు. అది నన్ను బాధించాయి. టీటీడీని తమ సొంత రాజకీయాలకు వాడుకోకూడదు.