రవీంద్రభారతి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్‌ మహానగర అస్తిత్వానికి ప్రతీక ‘వెల్లువలో పూచిక పుల్లలు’ నవల అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి అన్నారు. శుక్రవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నవలా స్రవంతి-3 నిర్వహించారు. భాస్కరభట్ల కృష్ణారావు రచించిన ‘వెల్లువలో పూచిక పుల్లలు’ నవలపై ఆడెపు లక్ష్మీపతి ప్రసంగం చేశారు. ఈ సభకు అధ్యక్షత వహించిన నందిని సిధారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ నగర విశిష్టతను చాటుతూ భాస్కరభట్ల రచన చేశారని గుర్తుచేశారు. లక్ష్మీపతి మాట్లాడుతూ భాస్కరభట్ల కృష్ణారావు రచనా శైలి గొప్పదని వివరించారు. నవలలో ఆయన ఎన్నుకున్న పాత్రలు విభిన్నమైనవని, 40కథలు 4 నవలలు రాశారని తెలిపారు. హైదరాబాద్‌ నగరంలోని రాజేంద్రనగర్‌, బుద్వేల్‌ వంటి ప్రాంతాల విశిష్టతను వివరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.