తెలంగాణ విద్వత్సభ నిర్ణయం 

ధార్మిక చింతనతో సుభిక్షం: చందూలాల్‌

ఘనంగా ముగిసిన జ్యోతిష మహాసభలు

రవీంద్రభారతి/హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): వికారి నామ సంవత్సరంలో రాబోయే తెలుగు పండుగలను తెలంగాణ విద్వత్సభ ఖరారు చేసింది. దాదాపుగా తెలంగాణలోని పంచాంగకర్తలంతా హాజరై ఓ నిర్ణయానికి వచ్చి జాబితా తయారు చేశారు. దీన్ని త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో 2రోజులుగా జరిగిన తెలంగాణ రాష్ట్ర జ్యోతిష మహాసభలు మంగళవారం ముగిశాయి. శ్రీజగన్నాథ మఠాధిపతి, శ్రీ వ్రతధర శ్రీనివాస రామానుజ జీయర్‌స్వామి జ్యోతిని వెలిగించి రెండో రోజు సభలను ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి చందూలాల్‌.. ధార్మిక చింతనతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. తెలంగాణ జ్యోతిష మహాసభలను ఇంత ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి అన్నారు.అనంతరం సరస్వతీ క్షేత్ర వ్యవస్థాపకులు అష్టకాల నరసింహరామశర్మ అవధాని, జ్యోతిష పండితులు వావిలాల దామోదరశర్మ, కొండగడప శ్రీధరశర్మ, వఝల నరహరి, మరుమాముల వెంకటరమణశర్మ, చంద్రశేఖరశర్మ పాల్గొని జ్యోతిష సభలను కొనసాగించారు. ఆలయాలు-ఆగమాలు, ఆలయపాలన-ధర్మరక్షణ, అర్చకుల విద్యుక్త ధర్మాలు, ధార్మికస్ఫూర్తి కేంద్రం-ఆలయం అనే అంశాలపై సదస్సులు నిర్వహించారు.

సాయంత్రం 5 గంటలకు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా దివ్యజ్ఞాన సిద్ధాంతి రూపొందించిన ‘జ్యోతిరాదిత్యమ్‌’ రూపకాన్ని ప్రదర్శించారు. ముగింపులో భాగంగా ద్వాదశ (12) విద్వన్మూర్తులకు విద్వత్సభ విశిష్ట పురస్కారంతో సత్కరించింది. ఇందులో భాగంగా దర్బోల విశ్వనాథశాస్త్రి, పార్నంది లక్ష్మీనారాయణ శర్మ, దుద్దిళ్ల మనోహర శర్మ, నల్లగొండ పురుషోత్తమశర్మ, పాండురంగాచార్యులు, యాయవరం రామశర్మ, మురళీకృష్ణమాచార్యులు, త్రిగుళ్ల ప్రభాకర శర్మ, ఎం.లక్ష్మీనరసింహాచార్య, శాస్త్రుల భార్గవరామశర్మ, గంగాపురపు హరిహరనాథశర్మలను సత్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఎమ్మెల్యే ఎన్వీఎ్‌సరెడ్డి తదితరులు పాల్గొన్నారు.