పద్య మౌక్తికాలు ఆవిష్కరణ

చిక్కడపల్లి, హైదరాబాద్, ఆగస్టు7 (ఆంధ్రజ్యోతి): వాస్తవాలు, సామాజికఅంశాలను జీవితసత్యాలను సుభాషితాలుగా మలిచి మౌక్తిక పద్యాలుగా రచించిన కవి మాదిరాజు బ్రహ్మానందరావు కృషి ఎంతో గొప్పదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా. కేవీ రమణాచారి అన్నారు. నవ్యసాహితీ సమితి, నవ్యనాటక సమితి ఆధ్వర్యంలో మంగళవారం త్యాగరాయగానసభలో డా. మాదిరాజు బ్రహ్మానందరావు రచించిన ‘వింటూ ఉంటే చెపుతూ ఉంటా’ పద్య మౌక్తికాలు పుస్తకావిష్కరణ కార్యక్రమం తెలుగు అకాడమి పూర్వ సంచాలకులు ఆచార్య డా. కె.యాదగిరి అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా కృతి స్వీకర్త రమణాచారి మాట్లాడుతూ 12 మంది కవులు, రచయితలు అందరినీ ఒకే వేదికపైకి చేర్చడం అభినందనీయమన్నారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ ప్రభుత్వ దాశరథి స్మారక ప్రథమ పురస్కార గ్రహీత డా. తిరుమల శ్రీనివాసాచార్య మాట్లాడుతూ బ్రహ్మానందరావు తెలుగు, సంస్కృతంలో ప్రామాణిక గ్రంథాలు రచించారన్నారు. ఆయన సంస్కృతాంధ్రభాషల్లో నిష్ణాతులన్నారు. కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, డా. గండ్ర లక్ష్మణరావు, డా. కన్నమరాజు గిరిజామనోహర్‌బాబు, డా. పతంజలి, ఫణీంద్ర, సంగనభట్ల నరసయ్య, మురళీధర్‌గౌడ్‌, వేణుశ్రీ, వేమరాజు విజయకుమార్‌, సుధారాణి, కామేశ్వరరావు పాల్గొన్నారు.