రవీంద్రభారతి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ప్రతిభను గౌరవించడం అభినందనీయమని ప్రముఖ నటుడు, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ అన్నారు. పురస్కారాలు మన ప్రతిభను మరింత పెంపొందిస్తాయన్నారు. శనివారం రవీంద్రభారతిలో మయూరి ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో విశ్వసంస్కృతి నంది పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రతిభావంతులకు పురస్కారాలతో సత్కరించారు. అతిథిగా పాల్గొన్న బాబూమోహన్‌ పురస్కారగ్రహీతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మయూరి ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో విభిన్నమైన కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రశంసించారు. ఆయా రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న వారికి పురస్కారాలు అందజేయడం ఆనందకరమని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత ఎన్‌.ఎ్‌స.నాయక్‌, మయూరి ఆర్ట్స్‌ అధినేత్రి రాఽధ, సాయిప్రియ, దత్తు పాల్గొని మనోహర్‌ సింధమ్‌, డాక్టర్‌ ఆనంద్‌లతో పాటు పురస్కారగ్రహీతలను అభినందించారు. గాయని జె.విజయలక్ష్మి(బీడీఎల్‌ రిటైర్డ్‌ ఎంప్లాయ్‌) పురస్కారం అందుకున్నారు. సభకు ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.