రవీంద్రభారతి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా కె.విశ్వనాథ్‌ సినిమాలు నిలుస్తాయని తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య అన్నారు. సోమవారం రవీంద్రభారతిలో శ్రుతిలయ ఆర్ట్స్‌ అకాడమీ, సీల్‌వెల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో కళాతపస్వి కె.విశ్వనాథ్‌ జన్మదిన వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పేరిట నెలకొల్పిన జీవన సాఫల్య పురస్కారాన్ని పీసీఆర్‌.వేర్‌హౌసింగ్‌ లి. సీఎండీ పీసీ రాయులు, ఎస్‌.కృష్ణభట్‌, ఉషాభట్‌ దంపతులకు ప్రదానం చేశారు. ఇందులో భాగంగా పాత్రికేయులు వాజేందర్‌, మోహన్‌రెడ్డిలకు  కె.విశ్వనాథ్‌ మీడియా అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కె.విశ్వనాథ్‌ కేక్‌ కట్‌ చేసి పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. 

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రోశయ్య, సీల్‌వెల్‌ బండారు సుబ్బారావు, కొత్త కృష్ణవేణి, ఆర్‌ఎన్‌.సింగ్‌, వైకే.నాగేశ్వరరావు, ఆమని తదితరులు పురస్కారగ్రహీతలను సత్కరించి అభినందించారు. కె.విశ్వనాథ్‌ మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. పుట్టినరోజు సందర్భంగా పురస్కారాలు అందజేయడం అభినందనీయమన్నారు. సభకు ముందు ప్రముఖ గాయని ఆమని నేతృత్వంలో ఝుమ్మందినాదం శీర్షికన సంగీత విభావరి నిర్వహించారు. కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన చిత్రాల్లోని పాటలను ఆలపించి అలరించారు.