‘సామాజిక స్మగ్లర్లు- కోమటోళ్లు’ పుస్తకంపై మండిపాటు

తమను కించపరిచేలా రాశారంటూ ఆందోళనలు
ఐలయ్య దిష్టిబొమ్మల దహనం.. పోలీసులకు ఫిర్యాదు
క్షమాపణ చెప్పాలని, పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్‌

హైదరాబాద్‌ సిటీ/ఖమ్మం అర్బన్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ‘సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు’ అంటూ పుస్తకాన్ని రచించిన ప్రొఫెసర్‌ కంచ ఐలయ్యపై ఆర్యవైశ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ధర్నాలు, ఆందోళనలకు దిగారు. పలు చోట్ల ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆర్యవైశ్యులకు ఐలయ్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఎల్‌బీనగర్‌ చౌరస్తాలో ఐలయ్య దిష్టిబొమ్మను దహనం చేసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వేదిక కన్వీనర్‌ కాచం సత్యనారాయణ గుప్త మాట్లాడుతూ.. ధార్మిక, సేవా, సామాజిక రంగాల్లో ఎల్లప్పుడూ ముందుంటూ దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తున్న ఆర్యవైశ్యులపై ఐలయ్య వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటని అన్నారు. కులాల మధ్య చిచ్చు పెడుతూ.. అగ్రకులాలపై అక్కసు వెళ్లగక్కుతున్న ఐలయ్యకు గతంలోనూ చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ మారకపోవడం బాధాకరమన్నారు.మేధావివర్గంగా చెప్పుకొంటూ కుసంస్కారిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఐలయ్య రాసిన ఈ పుస్తకం వల్ల ఆర్యవైశ్యుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. ఆయనతోపాటు పబ్లిషర్‌పై క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు ఐలయ్య వెంటనే క్షమాపణ చెప్పాలని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ డిమాండ్‌ చేసింది. లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని మహాసభ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అమరవాది లక్ష్మీనారాయణ, రాచమళ్ల వెంకటేశ్వర్లు, బూరుగు రవికుమార్‌ హెచ్చరిం చారు. వైశ్య కులాలను కించపరిచేలా పుస్తకం రాసిన కంచ ఐలయ్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాటేదాన్‌- శివరాంపల్లి ఆర్యవైశ్య సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.