గ్రంథాలయంలోకి అడుగుపెడితే.. ఆ రోజు పత్రికల నుంచి... శతాబ్దాల నాటి పుస్తకాల వరకు ఎన్నింటినో చూడొచ్చు. కానీ ‘జైలోథెక్‌’ లైబ్రరీకి వెళితే.. రకరకాల చెట్లు, భిన్నమైనకలపకు సంబంధించిన సమాచారం మాత్రమే దొరుకుతుంది. అవన్నీ చూడచక్కని చెక్క పుస్తకాలే. అక్షరాల జాడలేని ఆ పుస్తకాల్లో ఏముందో తెలుసుకుందాం..
 

నీలగిరి చెట్టు కాండం ఒకలా ఉంటే... వేప చెట్టుది మరోరకంగా ఉంటుంది. కొన్ని చెట్ల బెరళ్లు సుగంధ పరిమళాలు వెదజల్లితే, మరికొన్నింటికి ఏ సువాసనా ఉండదు. పూలు పూసే చెట్లు వేరు, ముళ్ల చెట్లు వేరు. ఇలా విత్తనం నుంచి చిటారు కొమ్మదాకా ఒక్కో చెట్టు గురించి చెప్పుకుంటే పోతే.. వాటి చరిత్ర మహావృక్షమంత అవుతుంది. చెట్ల పుట్టుపూర్వోత్తాల గురించి తెలుసుకోవాలంటే.. వృక్షశాస్త్ర పుస్తకం ఒకటి చదివితే సరిపోదు. ఇంకా ఇంకా తెలియాలంటే.. ‘జైలోథెక్‌’ గ్రంథాలయాలకు వెళ్లాల్సిందే. ఇలాంటి లైబ్రరీలు కొన్ని దేశాల్లో మాత్రమే ఉన్నాయి. అతి పెద్ద జైలోథెక్‌ లైబ్రరీ యేల్‌ విశ్వవిద్యాలయంలో ఉంది. దీంట్లో దాదాపు 60 వేల చెట్లకు సంబంధించిన సమాచారం ఉంది. ఇందులో పుస్తకాలన్నీ కూడా కలప రూపంలోనే ఉంటాయి.

 బెల్జియంలోని టెర్‌వురెన్‌లో ఉన్న రాయల్‌ మ్యూజియంలో 57,000 కలప పుస్తకాలన్నాయి.

 హేంబర్గ్‌లో 37 వేల చెట్లకు సంబంధించిన సమాచారం ఉంది.

ఆకులు, కాండాలు, వేళ్లు, పూలు, విత్తనాలు, బెరళ్లు ఇలా చెట్లకు సంబంధించిన అన్ని భాగాలను చెక్క పుస్తకాల్లో భద్రపరుస్తారు. ఆయా చెట్ల చరిత్ర కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. లైబ్రరీలో పుస్తకాలు అమర్చినట్టే వీటినీ అద్దాల అల్మరాల్లో ఉంచుతారు.
 

చెట్ల కాండాలు, లేదా దుంగలను తీసుకుని వాటిని పుస్తకరూపంలో మలుస్తారు. వాటిపై ఆ చెట్ల పేరును అందంగా చెక్కుతారు.వాటిని చూస్తే పుస్తకాల్లానే ఉంటాయి. పరీక్షగా చూస్తే తప్ప అవి కలప పుస్తకాలని తెలయదు. 

ఈ కలప పుస్తకాలు భద్రపరుస్తున్న గ్రంథాలయాలనే ‘జైలోథెక్స్‌’ అంటున్నారు.
 
మీకు తెలుసా?

 అత్యంత ప్రాచీన గ్రంథాలయాల్లో ‘అసుర్‌బనిపాల్‌’ గ్రంథాలయం ముఖ్యమైంది.క్రీ.పూ. 668-627 మధ్యకాలంలో అస్పిరియన్‌ సామ్రాజ్యాన్ని ఏలిన అసుర్‌ బనిపాల్‌ ఈ గ్రంథాలయాన్ని నిర్మించారు.

 కెనడా, అమెరికా దేశాల సరిహద్దులో ఉన్న ‘హాస్కెల్‌ ఫ్రీ లైబ్రరీ’కి ఓ ప్రత్యేకత ఉంది. రెండు దేశాల్లో ఉంటూ, ఆ రెండు దేశాలు కలిపి నిర్వహించే లైబ్రరీగా ఇది నిలిచింది.