40 పుస్తకాలు, ఆంధ్రజ్యోతిలో ఆధ్యాత్మిక రచనలు
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
నేడు హైదరాబాద్‌లో అంత్యక్రియలు

హైదరాబాద్‌ సిటీ, మే 25(ఆంధ్రజ్యోతి): కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పింగళి సూర్యసుందరం(88) మరణించారు. ఆయన కొన్ని నెలలుగా హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం సిటీ న్యూరో ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత శనివారం అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య ప్రతిభా కుమారి, కుమార్తె శైలజ, కుమారుడు శ్రీధర్‌ ఉన్నారు. సూర్యసుందరం ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, కవి పింగళి లక్ష్మీకాంతం రెండో కుమారుడు. గుంటూరు, విశాఖలో చదువుకున్న సూర్యసుందరం ఏజీ ఆఫీసులో ఉద్యోగం చేశారు. 1988లో డిప్యూటీ అకౌంటెంట్‌ జనరల్‌గా రిటైరయ్యారు.

 
అప్పటి నుంచి ఆయన ఎన్నో తెలుగు ఆధ్యాత్మిక రచనలు చేశారు. సుమారు 35-40 పుస్తకాలు రచించారు. ఆంగ్లం నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఆంగ్లలోకి అనువాదాలు చేశారు. బీవీ నరసింహాచార్యులు రచించిన సెల్ఫ్‌ రియలైజేషన్‌ అనే ఆంగ్ల పుస్తకాన్ని ‘ఆత్మ సాక్షాత్కారం’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తకానికి 2002లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఈయన ఎక్కువగా భగవాన్‌ శ్రీరమణ మహర్షి బోధనలపై రచనలు చేశారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆధ్యాత్మికతపై పలు రచనలు చేశారు. జూబ్లీహిల్స్‌ హూడా అశ్విని లేఅవుట్‌లోని ఆయన స్వగృహంలో భౌతికకాయాన్ని ఉంచారు. అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.