న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): విద్యను, సాహిత్య అధ్యయాన్ని కేవలం ఉపాధి, వ్యాపార ప్రయోజనాలకు కాకుండా జ్ఞానార్జన సాధనంగా ఉపయోగించాలని హార్వర్డ్‌ విద్యార్థుల సమ్మేళనంలో కేంద్రీయ హిందీ సమితి అధ్యక్షుడు, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ సూచించారు. అమెరికా మసాచూసెట్స్‌ రాష్ట్రం బోస్టన్‌ నగరంలోని ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఈనెల 10, 11 తేదీల్లో జరిగిన 15వ భారతీయ మహాసభలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘ఆధునిక భారతంలో సాహిత్యం: భాషలు, ఉనికి, అవగాహన’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా వక్తలు పాల్గొనగా.. యార్లగడ్డ మాత్రమే తెలుగువారు కావడం విశేషం.