ఆర్టిలరీ రెజిమెంట్‌-అంటే-ఫిరంగి దళం. ఆఫీసర్ల మెస్‌ ఎప్పుడూ కళకళలాడు తుండటం రోజూ తిలకించే వాళ్ళకే అనుభవంలోకి వచ్చే విషయం. పెద్ద ఆవరణ. ముందుభాగంలో ముచ్చట కొలిపే పచ్చటి లాన్‌. అంతకుమించి బ్రిటిషుకాలం నాటి పెద్దపెద్ద వృక్షాలు. భవనం గూడాకలోనియల్‌ తరగతిదే అని విశాలమైన వరండాలు, రాబర్ట్‌ క్లైవ్‌ కాలం నాటి మూడడుగుల వ్యాసం గల కోటలు కట్టిన సున్నపు స్తంభాలు - చూచే వాళ్ళకు ఇట్టే అర్థమై పోతుంది.చెట్లవెనక టెన్నిస్‌కోర్టులో కెప్టెన్‌ తివారీ (టిక్స్‌) నారాయణన్‌ (నిక్స్‌) సింగిల్స్‌లో ఉన్నారు. వరండాలో కారమ్స్‌ ముందు కూచున్న - రస్తోగి (రాట్స్‌) పూరి (పికిల్స్‌) మధ్య మధ్య హుషారుగా కేకలేస్తూ తమ ఆటకన్నా వాళ్ళ ఆటనే తిలకిస్తున్నట్టున్నారు. దాదాపు అందరికీ ఏదో ఒక ముద్దుపేరు. యాభై వయసులో పడ్డ కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌జగన్నాథ్‌ గూడా - ఈ కుర్రకారుకు జిమ్మీ. అయితే ఆయన ముందు అనరు.మేజర్‌ మూర్తి రెజిమెంట్‌ ఆటస్థలాల నుంచి అప్పుడే తెల్లషార్టు. షర్టు మీది మట్టి మరకలతో వచ్చాడు. జవాన్ల గేమ్సులో చాలా ఆసక్తిచూపుతాడు. ఆ సాయంత్రం వాలీబాల్‌, ఫుట్‌బాల్‌ ఆటగాళ్ళ సెలెక్షన్లు జరిగాయి. చాలా సీనియర్‌ అయిన మేజర్‌ మూర్తికి ఇటువంటి బాధ్యతలు అదనంగా పడుతుంటాయ్‌. స్వతహాగా మంచి ఆటగాడు.ఆ నెలకు మెస్‌ సెక్రటరీ కావటం వల్ల గబగబా హెడ్‌ కుక్‌కు, మసాల్జీకీ, బేరర్లకూ, బాయిస్‌కూ ‘మెనూ’ గురించి కొద్ది చర్చ తర్వాత ఆజ్ఞలు జారీ చేశాడు. అదిగాక ఆ రాత్రి మెస్‌ డిన్నర్‌ నైట్‌. 

రెజిమెంటల్‌ ఆఫీసర్లు కుటుంబాలతో సహా వస్తారు. సైనికాచారం ప్రకారం - పెళ్ళి అయి కుటుంబాలతో క్వార్టర్సులో ఉంటున్న ఆఫీసర్లు కూడా మెస్‌లో సభ్యులే. డిన్నర్‌ తర్వాత ఫిలిం షో ఉంది. కమాండింగ్‌ ఆఫీసర్‌ పెద్ద కూతురు లీలా జగన్నాథ్‌ సెలెక్ట్‌ చేసిన అర్థం పర్థం లేని వ్యాపార సినిమాలంటే అందరికీ మంటే. ఈ మాటు కెప్టెన్‌ దేవ్‌గుణ్‌ సబ్‌ టైటిల్స్‌ ఉన్న ఒక రష్యన్‌ పిక్చరు పేరుచెప్పి మొత్తం మీద దాన్ని రప్పించాడు. ఆర్ట్‌ ఫిలిమ్స్‌ అంటే తనకూ ఇష్టమే. నిజానికి రెజిమెంటల్‌ ఫిలిమ్‌ క్లబ్బుకు, మెస్‌ లైబ్రరీకి తనే సెక్రటరీ అయినా, దేవ్‌గుణ్‌ అభిరుచులు చాలా ఉదాత్తమైనవని అనుకొంటూ ఉంటాడు. అటువంటి మూర్తికి మాత్రం ముద్దుపేర్లుండవా? పూర్తి పేరు దక్షిణామూర్తి కావటం వల్ల ‘‘డెక్కన్స్‌’’ లైబ్రరీ పుస్తకాల పురుగుగా ‘బుక్‌ వర్మ’.రష్యన్‌ చిత్రం చాలా అద్భుతంగా వుంది. మొత్తం వంద నిమిషాలే. వేరా పనోవా కథ- ‘‘సిస్టర్స్‌’’. కథ, నటన, ఛాయాగ్రహణం అద్వితీయం అన్నారందరూ. కల్నల్‌ తన భుజం తడితే, తను దేవ్‌గుణ్‌ను సెభాసన్నాడు. ఎందుకో మూర్తి ఆలోచనా నిమగ్నుడైనాడు. ఎందుకో ఏమిటి? అది తన జీవితంలో కొన్నిఘట్టాలను చిత్రించినట్లుంది. కాకపోతే అందులో ‘గాల్యా’ అనే యువతిది ప్రధాన పాత్ర. గాల్యా బదులు మూర్తి అనే యువకుడైతే జీవితం అంతా ఒకటే.