‘‘కొంపమీద’’ గెద్ద వాలిందే! నీ కొడుకొస్తాడనుకుంటా!’’ చెప్పులు బయట విడిచి ఇంట్లోకొస్తూ అన్నాడు ఈశ్వరయ్య.‘‘గెద్ద వాలిందా? అయ్యయ్యో ముందు దాన్ని కొట్టండీ’’ అంటూ ఆందోళనగా బయటకు వెళ్ళబోతున్న భార్య కామాక్షి చెయ్యి పట్టుకుని ఆపి, ‘‘నేను కొట్టాన్లే, పోయింది. రెండ్రోజుల్నించి నా ఎడం కన్ను కొట్టుకుంటోంది. మరి దాన్ని ఆపడం ఎలా?’’ అన్నాడు ఈశ్వరయ్య.‘‘చాల్చాలు.... అన్నీ అపశకునం మాటలు. కొడుకు ఇంటికొస్తే అది కీడవుతుందా?’’ భర్త భుజం మీంచి తువ్వాలు తీసి కొక్కేనికి తగిలించి, చెంబుతో మంచినీళ్ళు తెచ్చిచ్చింది కామాక్షి. ‘‘వాడెందుకొస్తున్నాడో ఏమో... వచ్చిన ప్రతిసారీ డబ్బు కోసమేనా ఏం?’’ కొడుకును సమర్థించబోయింది కామాక్షి.‘‘ఎందుకే లోపలొకమాట బైటొక మాటానూ? వాడెప్పుడన్నా మన యోగక్షేమాలు కనుక్కోడానికొచ్చాడా? వచ్చేదే డబ్బుకోసం. నే చెమటోడ్చి సంపాదించిన నాలుగున్నర ఎకరాలు వాడి ఎదాన్న పెట్టాను’’.‘‘ఇదిగో ఊరికే ఆడిపోసుకోకండి. టౌనులో ఉన్న వాళ్లకి అనేక ఖర్చులుంటాయి. వాడికి మాత్రం మనల్ని అడిగే హక్కు లేదా ఏం?’’‘‘నేనేం వాణ్ణి తిట్టడం లేదే బాబూ. నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. వాడు తన్నుకుపోగా మిగిలింది ఒక ఎకరం. అది కూడా నీ పుట్టింటాళ్లు నీకు పసుపు కుంకుమల నిమిత్తం ఇచ్చింది. ఉన్న ఆ ఆఖరెకరాన్నీ అమ్మేసుకుంటే మనకిక ఈ ఊరితో రుణం తీరిపోయినట్టే’’.‘‘చాలయ్యా చాలు! ఇంకా వాడు రానూ లేదు. నిన్నేమీ అడగనూ లేదు. అప్పుడే పాడు మాటలు... నాకు కష్టం తోస్తుందయ్యా’’ కామాక్షి గొంతులో బాధ ధ్వనించింది.రాత్రి భాస్కరం రానే వచ్చాడు. వస్తూనే పెద్దగాలినీ, వాననీ వెంటబెట్టుకొచ్చాడు.‘‘ఛీఛీ... ఈ ఊరు బావుపడదు. రోడ్డు కుదుపుల్లో నడపలేక ఆటోవాడు సగం నించే వెనక్కెళ్ళిపోయాడు. 

చూడు నా బట్టలన్నీ ఎలా తడిసి ముద్దయిపోయాయో!’’ చిరాకుపడిపోతూ అన్నాడు భాస్కరం.‘‘ముందు కాళ్లు కడుక్కుని బట్టలు మార్చుకో నాన్నా. మీ నాన్న పంచిస్తాను. అయ్యో, తలంతా తడిసిపోయిందిరా’’ తువ్వాలుతో తల తుడిచింది కామాక్షి.తర్వాత అందరికీ కంచాలు పెట్టింది అన్నానికి. తనేం తిననన్నాడు భాస్కరం. అతడికీ వంటలూ, ముతక బియ్యం నచ్చవు. ఆకల్లేదన్నాడు. తల్లి బతిమాలి పాలు కాచిచ్చింది. పాలు తాగుతూ తనొచ్చిన కారణం చెప్పబోయాడు. అది ఎప్పుడూ వింటున్న పాత పురాణమే. ‘‘అవన్నీ ఎందుకు అసలు విషయం చెప్పు ఒక్క ముక్కలో.. అన్నాడు ఈశ్వరయ్య.‘‘ఒక్క ముక్కలో చెప్పాలా? సరే అయితే. నాకు నాలుగు లక్షలు కావాలి. విపిన్‌ ఆస్ట్రేలియానించి వెనక్కొచ్చేశాడు. ఏదో కంపెనీ పెడతాట్ట. బ్యాంకు సగం ఇస్తుంది. మిగతాది మనం సర్దాలి!’’ అన్నాడు భాస్కరం స్వరం పెంచి.కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. బయట ఉరుములు మాట్లాడాయి ఊరంతా వినబడేలా.