ఆఫీసుకెళ్ళే సమయం. సువర్ణ భోజనం క్యారియర్‌ సర్దుకుంటోంది. భర్త రంగప్రసాద్‌కు కాఫీ టిఫిను ఇచ్చి, అతడి క్యారియర్‌ సర్దిపంపించేసరికి ఇంత సమయం పట్టింది. పిల్లల్ని తయారుచేసి పంపడంలో పనిమనిషే కాస్త సాయం చేయడంతో తనకు కొంతసమయం మిగిలింది. కొంచెం ఆలస్యమైనా తన ఆఫీసుమేనేజర్‌ ఊరుకోడు. కేకలేస్తాడు. హడావుడిగా రెడీ అవుతోంది సువర్ణ.

అత్తగారు, మామయ్యగారు పూజగదిలో ఉన్నారు. మామయ్యగారు మంత్రాలు చదవడం వినిపిస్తోంది. అంతలో సువర్ణ మొబైల్‌ ఫోన్‌ మోగింది. ఫోన్‌ అందుకుంది. అవతలవైపు రంగప్రసాద్‌. చిరాకును అణుచుకుంటోంది సువర్ణ.ఇంటినుండి భర్త బయలుదేరి అరగంట కూడా కాలేదు. అప్పుడే ఫోను.‘‘చెప్పండి. ఫోన్‌ చేశారెందుకు?’’‘‘నా అకౌంట్‌లోకి రెండువేల రూపాయలు బదిలీ చెయ్యి. ఎలక్ట్రిసిటీ బిల్లు చెల్లించాలి. చెప్పడం మరచిపోయాను’’ చెప్పాడు రంగప్రసాద్‌.ఆమె చిరాకు రెట్టింపైంది. ‘కానీ నిజానికి బిల్లు చెల్లించడానికి ఇంకా వారంరోజులు సమయం ఉంది. ఇప్పుడు భర్త ఫోన్‌ చేసింది వాస్తవంగా బిల్లు చెల్లించడానికికాదు. వేరే ఆర్థికావసరానికి ఈ డబ్బు వాడుకుంటానని భార్యకు చెప్పలేక–’అరగంట తర్వాత షేర్‌ ఆటోలో బయలుదేరింది సువర్ణ.

సమయానికి ఆఫీసుకు చేరుకుంది. ఆఫీసుకు చేరుకుందన్నమాటేగానీ, భర్త ఎంత అప్రయోజకుడో తలచుకునేకొద్దీ బాధ ఎక్కువవుతోంది ఆమె మనసులో.ఆ ఊళ్ళోనే చిన్నఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు రంగప్రసాద్‌. తనసంపాదన కేవలం తన ఖర్చుకోసమే అనే గాఢనమ్మకం అతగాడిది. అందువలన ఆ ఇంటి బరువుబాధ్య తలన్నీ సువర్ణకే దఖలుపరచపడ్డాయి. మామగారికివచ్చే ఫించన్‌ అత్తమామయ్యల మందులఖర్చుకే సరిపోదు. ఇంటిఖర్చులు, పిల్లల చదువులకోసం డబ్బు కావాలంటే తను ఉద్యోగం చేయడం తప్పనిసరి. వచ్చిన ఉద్యోగం మంచిది. ఇంట్లో పనులన్నీ సక్రమంగా చేసుకున్నట్లే ఆఫీసుబాధ్యతల్నికూడా చాలాశ్రద్ధగానిర్వహిస్తూ, మంచిపేరు సంపాదించుకుంది సువర్ణ.