కుటుంబసభ్యులందరినీ సమావేశపరిచాడతను. ఈరోజు మీకు ఎయిత్‌ వండర్‌ చూపించబోతున్నాను. నేను ఇంటికి తిరిగివచ్చేలోగా అందరూ తయారుగా ఉండండి అంటూ హాస్పిటల్‌కి వెళ్ళిపోయాడు. కానీ హాస్పిటల్‌లో అతనికి అనుకోని సమస్య ఎదురైంది. ఇంతకీ అతనికి హాస్పిటల్‌లో ఎదురైన సమస్య ఏమిటి? కుటుంబసభ్యులకు అతను చూపిస్తానన్న ఎయిత్‌వండర్ కథాకమామిషు ఏమిటి?

ప్రపంచవ్యాప్తంగా వేల థియేటర్లలో బాహుబలి–2 సినిమా రిలీజ్‌ డేట్‌ ఇచ్చేశారు. ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు పెద్ద ఎగ్జయిటింగ్‌ న్యూస్‌!బాహుబలిని కట్టప్ప చంపడంతో ఆ సినిమా మీద పెద్ద క్రేజ్‌ ఏర్పడింది. ఫస్టుపార్టు రిలీజ్‌ అయిన దగ్గర్నుంచి, ఎక్కడ నలుగురైదుగురు కూడినా దానిగురించే డిస్కషన్‌. ఇప్పుడు డీమానిటైజేషన్‌, మోదీ పరిపాలన పాత చింతకాయ పచ్చడే!‌ఆ డిస్కషన్‌లో నేనూ చేరి, రోజూ పాలు, బీరు పంచుకుంటూనే ఉన్నాను. మా ఫ్రెండ్స్‌ కల్సి నప్పుడల్లా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న విషయంలో తలో రకంగా స్పందించే వాళ్ళు. నా వర్షన్‌ నేను చెప్పాను. ఎవరిది కరెక్టో తెల్సుకుందామనే ఈ టెన్షన్‌ అంతా!రాత్రి నిద్ర పోతున్నప్పుడు సెల్లోనో, కలలోనో సరిగ్గా గుర్తులేదుగానీ – గురుగురుమంటూ నా సెల్‌ మోగిన సౌండ్‌ మాత్రం క్లియర్‌గా విన్పించింది.

‘‘రేయ్‌! కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో నీకు తెలుసా?’’ అంటూ ఓ గొంతు సవాల్‌ విసిరింది. నాకు బాగా తెల్సిన గొంతే! కానీ వాడు ఇలాంటి బాగా నలిగి, అరిగిపోయిన ప్రశ్నలు వెయ్యడే! ఏది మాట్లాడినా, చేసినా నావెల్టీగా ఉంటుందే? నాలో నేను తర్కించు కుంటుంటే – హ్హ!హ్హ!హ్హ! అంటూ అట్నుంచి వికటాట్టహాసం. ‘‘రాజమౌళికి, విజయేంద్ర ప్రసాద్‌కి తప్ప ఈ భూమి మీద ఇంకెవ్వరికీ తెలీదు’’ అన్నాడు. కోపం వచ్చింది నాకు.‘‘అర్థరాత్రి నిద్ర చెడగొట్టింది ఇది చెప్పడానికా గురూ?’’ అని నేనింకేదో అనేలోపు–‘‘ఆగు! అందరికన్నా ముందుగా ఆ రహస్యం తెల్సుకోవాలనుందా?’’ అని మెటాలిక్‌ సౌండ్‌లో సేమ్‌ గొంతు మిమిక్రీ చేస్తున్నట్టు.‘‘ఎలారా? ఎక్కడ? ఎప్పుడు? వేర్‌? వెన్‌? హౌ?’’ తూటాల్లా నా గొంతులోంచి మాటలు వెలువడ్డాయి.