పూర్వం గాంధారదేశాన్ని చిత్రసేనుడు అనే రాజు పాలించేవాడు. ఆ రాజుగారి అదృష్టమో ఏమో! ఋతువులన్నీ రాజ్యంలో వేళకి వచ్చి పోతుండేవి. మంచి వానలు కురిసి, బాగా పంటలు పండేవి. పౌరులంతా క్షేమంగా, హాయిగా జీవించేవారు. సమస్యలు ఉండేవి కావు. తాతలూ, తండ్రులూ ఆర్జించి పెట్టడంతో కోశాగారం కూడా నిండుగా ఉంది. ఫలితంగా రాజుగారికి పని లేకుండాపోయింది. పని లేని రాజుగారు మిఠాయిలు తింటూ కథలు వినడాన్ని పనిగా పెట్టుకున్నాడు. హంసతూలికా తల్పం మీద కూర్చుని, రకరకాల మిఠాయిలు తింటూ కథలు వినడమే రాజుగారి దినచర్య. ఎంత పెద్దకథయినా పర్వాలేదు, ఎన్ని గంటలయినా పర్వాలేదు. వినడానికి రాజుగారు సిద్ధం. కథ చెప్పలేక చెప్పేవారు అలసిపోవాలిగాని, వినే రాజుగారు అలసిపోయారన్నది ఎప్పుడూ ఎవరూ వినలేదు. కనలేదు.‘‘నేను చెప్పిన కథ ఎలా ఉంది మహారాజా?’’ అని పొరపాటున ఎవరైనా అడిగితే రాజుగారి సమాధానం ఒకటే:‘‘నీ కథలో ఒకటే లోపం బాబూ! బాగా చిన్న కథ చెప్పావు.’’ అనేవారాయన. ప్రపంచంలోని గొప్పగొప్ప కథకులంతా గాంధారదేశాన్నీ, చిత్రసేనుణ్ణీ సందర్శించినవారే! వారంతా రాజుగారికి చెప్పని కథంటూలేదు. రోజుల తరబడి కథలు చెప్పేవారు. వారానికో, పదిరోజులకో కథ పూర్తి అవుతుంది కదా! కథ పూర్తికాగానే:

‘‘అయ్యో అప్పుడే అయిపోయిందా?’’ అనే వారు రాజుగారు. బాధపడేవారు. రోజుకి వంద లడ్లు తినే రాజుగారు, ఆ బాధతో తొంభై తొమ్మిది మాత్రమే తినేవారు. అది చూసి కళ్ళు చెమర్చుకునేవారు సేవకులు.వారానికో, పదిరోజులకో కథలు అయిపోవడం, తను బాధపడడం, మిఠాయిలు తినలేకపోవడం భరించలేని రాజుగారు ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చారు. అంతులేని కథ చెప్పాలి తనకి. అలా కథ చెప్పినవారికి, మంచి బహుమతి ప్రకటించారాయన. చుట్టపక్కల రాజ్యాలన్నిటా ఆ విష యాన్ని దండోరా వేయించారు.ఎవరయితే రాజుగారికి అంతులేని కథ, ముగింపులేని కథ చెబుతారో వారికి రాకుమారి చిత్రాంగిని ఇచ్చి పెళ్ళి చేస్తారు. అంతేకాదు, అర్థరాజ్యాన్ని కూడా ఇచ్చి, పట్టాభిషిక్తుణ్ణి చేస్తారు.ఒకవేళ అలా చెప్పలేని పక్షంలో శిక్ష విధిస్తారు. అది చాలా కఠినమైన శిక్ష. అంతులేనికథ చెబుతామంటూ వచ్చి, చెప్పలేని కథకునికి శిరచ్ఛేదమే! తల తీసేస్తారతనికి.