బాస్‌రూంలోకి నెమ్మదిగా తలుపుతోసుకెళ్ళాడు రవి. భాస్కర్‌ కళ్ళెత్తి ఏమిటన్నట్లు చూశాడు. ‘సర్‌! ఈ రోజు మీకు చెకప్‌ ఉంది’ అన్నాడు.‘‘ఈరోజు కుదరదులే’’ అని మళ్ళీ ఫైల్లోకి చూపు మరల్చాడు భాస్కర్‌.‘‘అదికాదు సర్‌! రెండు మూడుసార్లు ఈమధ్య అనీజీగా ఫీలయ్యారుకదా’’ వినయంగా చెప్పినా, దృఢంగా పలికాడు.‘‘నో నో ఇప్పుడేం కుదరదు. రెండురోజులు ఆగి అప్పాయింట్‌మెంట్‌ తీసుకో’’.రవి నవ్వి ‘‘మీకు అప్పాయింట్‌మెంట్‌ ఎందుకు సార్‌. శశిగారే ఫోన్‌చేసి అడిగారు’’ అన్నాడు.

‘‘వాడొకడు నా ప్రాణానికి. సరే రేపు వెళ్దాం’’.కాసేపు నిలబడి మరేం మాట్లాడలేక రవి వెళ్ళిపోయాడు.ఒంటరిగా బతుకుతున్న భాస్కర్‌కి రవికుమార్‌ పర్సనల్‌ సెక్రటరీ. అతనే అన్నీ చూస్తాడు. కోటీశ్వరుడైన బాస్‌కి నిజమైన నమ్మినబంటు, స్నేహితుడు,బంధువు అన్నీతనే అయి మసులుకుంటాడు రవి.భాస్కర్‌ జీవితం గురించి పూర్తిగా తెలియకపోయినా, వాళ్ళూవీళ్ళూ చెప్పినదాన్నిబట్టి, తను అర్థం చేసుకున్నదాన్నిబట్టి, అతనికెంతో ఆత్మీయుడైపోయాడు రవి. అన్నీ ఉన్నా ఏమీ లేనివాడిలా కనిపిస్తాడు భాస్కర్‌. బాస్‌ ఎందుకలా ఉంటారో అనుకుంటూ మథనపడిపోతాడుగానీ, రవి నేరుగా ఏమీ అడగలేడు, మాట్లాడలేడు. అతని ప్రశ్నకి జవాబు దొరకడం లేదు.నిశ్శబ్దంగా ఉన్న గదిలో ఒక్కసారిగా టెలిఫోన్‌ మోగేసరికి ఉలికిపడ్డాడు భాస్కర్‌.

‘ఆశ్రమం’ అని కనిపించగానే ఒక్కక్షణం అదురు, భయం. ఫోన్‌ తీసుకుని హాలో అనేంతలోనే,మీ అమ్మగారు విశాలాక్షి ఉదయం నాలుగున్నరగంటలకి మృతిచెందారు. సాయంత్రం నాలుగుగంటలకు అంత్యక్రియలు చేసేందుకు కమిటీ నిర్ణయించింది. మీకు మా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాం.రికార్డెడ్‌ మెసేజ్‌ వినిపించింది. భాస్కర్‌ అలాగే ఉండిపోయాడు. భరించలేని బాధ దుఃఖంగా మారేందుకు కొన్నిసెకన్లు పట్టింది. అతనిగుండెలు దడదడలాడాయి. ఎండిన గుండెలు నెమ్మదిగా తడితడిగా, తేమగా రాళ్ళలోంచి ఉబికిన నీళ్ళలా, అతని కళ్ళునెమ్మదిగా కన్నీళ్ళతో నిండుకున్నాయి.