బెరేలీ అన్నే... ఆస్ట్రేలియావాసి. పుట్టపర్తి సాయిబాబాకు అమిత భక్తురాలు. 75 ఏళ్ల వయసులో కూడా అన్నే తరచూ పుట్టపర్తికి వెళ్లి నెలల తరబడి ఆశ్రమంలో ధ్యానం చేస్తూ గడిపేది. కానీ ఈసారి మాత్రం ఆమె అదృశ్యమైంది. ఎక్కువ దూరం ఒంటరిగా వెళ్లలేని స్థితిలో ఉన్న అన్నే అదృశ్యం కావడం స్థానికంగా సంచలనం సృష్టించింది. అన్నే అదృశ్యం వార్తను అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.ఆస్ట్రేలియన్‌ రాయబార కార్యాలయం ఈ విషయంపై వెంటనే స్పందించి అన్నే ఎక్కడున్నా వెతికి ఆమెను క్షేమంగా తమ దేశం పంపించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. అన్నే కుమార్తె ట్రేసీ ఆస్ట్రేలియాలో ప్రముఖ రచయిత్రి కావడంతో ఆమె స్వస్థలమైన సిడ్నీలోనూ అన్నే ఇండియాలో అదృశ్యమైందన్న వార్తాకఽథనాలు ప్రముఖంగా వచ్చాయి. వృద్ధురాలైన విదేశీయురాలు కన్పించకుండా పోయిన విషయాన్ని కేంద్రం కూడా సీరియస్‌గా తీసుకుంది. దాంతో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులపై ఒత్తిడి పెరిగింది. అనంతపురం జిల్లా ఎస్పీ రాజశేఖర్‌ బాబు అన్నే అదృశ్యం కేసు మిస్టరీ తేల్చడానికి పుట్టపర్తి డీఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

పుట్టపర్తి పోలీసు స్టేషన్‌...డీఎస్పీ శ్రీనివాస్‌ అన్నే కేసు ఫైల్‌ ఓపెన్‌ చేసి చదవడం ప్రారంభించారు.సిడ్నీ నుంచి 2014 జూలై 22వ తేదీన బయల్దేరిన అన్నే 23వ తేదీన పుట్టపర్తి చేరుకుంది. అదే రోజు ఆశ్రమానికి సంబంధించిన వసతిగృహంలో గది అద్దెకు తీసుకుంది. అప్పట్నించి ప్రతిరోజూ పగలంతా ధ్యానం చేసుకుంటూ అన్నదానం సమయంలో భక్తులకు మంచినీరు అందిస్తూ గడిపేది.

సుమారు 22 రోజుల పాటు అంటే ఆగస్టు 14వ తేదీ వరకు అన్నే వసతిగృహంలోనే ఉంది. ఆ తర్వాత ఆశ్రమం బయట అపార్ట్‌మెంట్లోకి మారాలనుకుంది. ఒక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ అద్దెకు ఉందని తెలుసుకుని, వాచ్‌మ్యాన్‌ అడిగిన 30వేల రూపాయల అడ్వాన్స్‌ ఇచ్చి సామాన్లు మార్పించుకుంది. ప్రతిరోజూ అక్కడి నుంచే బాబా ఆశ్రమానికి వెళ్లేది.ఆగస్టు 28వ తేదీ రాత్రి అన్నే సిడ్నిలోని తన కుమార్తెకు ఫోన్‌ చేసి మాట్లాడింది.