చంద్రహాస్‌ ఇంట్లోకి అడుగుపెడుతూనే రోహిత్‌ ఒక కవరు అందించాడు అది పెళ్ళిపత్రిక.సువర్ణ రాజారామ్‌ల వివాహం ఎప్పుడు జరిగేది, ఎక్కడ జరిగేది మొదలైన వివరాలు.‘‘పెండ్లి కొడుకు వయసు అరవై. సువర్ణ వయసు ఇరవై’’ గొంతులో ఒకలాంటి వణుకుతో చెప్పాడు రోహిత్‌.ఆశ్చర్యపోవడం చంద్రహాస్‌ వంతు అయింది.‘‘మా మావయ్య సువర్ణను అమ్మేశాడు. లక్ష రూపాయలకు’’ రోహిత్‌ కళ్ళవెంట నీళ్ళు.

జవాబివ్వకుండానే చంద్రహాస్‌ తన స్టూడియో గదిలోకి వెళ్ళాడు. ఇటీవలి కేన్వాస్‌ ‘మృగనయని’ తీశాడు. సువర్ణ అందమైన కళ్ళను చూశాడు. ఆమె మొదటిరోజు తనతో అన్న మాటలు గుర్తొచ్చాయి.‘‘మా మావయ్య మిమ్మల్ని కలవమని చెప్పాడు. మీరు నన్ను అందంగా మారుస్తారటగా’’చంద్రహాస్‌ మంచిపేరున్న పెయింటర్‌, చిత్రకారుడు. అతను గీసిన ఎన్నోచిత్రాలు, వర్ణ చిత్రాలు జాతీయ అంతర్జాతీయ ప్రదర్శనల్లో చోటుచేసుకున్నాయి. ప్రశంసలు అందు కున్నాయి. చిన్నతనం నుంచే బొమ్మలు గీయడంపై ఉండే అతని శ్రద్ధ, పట్టుదల అతనిని ఒక గొప్ప కళాకారుడిని చేసింది.అతను గీసే ప్రతి గీతలో జీవముంటుందని అంతా అంటారు. విదేశాలలో కూడా అతనికి మంచిపేరుంది. ముప్ఫైఏళ్ళ వయసులో ఆ స్థాయి తెచ్చుకోవడం అరుదైన విషయం. ‘కళాకారులు సాధారణంగా పేదరికం అనుభవిస్తారు’ అనేది నిజం కాదని తెలియజేస్తుంది చంద్రహాస్‌ జీవితం.

ఎన్నో ఉన్నత ప్రమాణాలున్న పత్రికలు చంద్రహాస్‌ నైపుణ్యాన్ని కొని యాడాయి.కొన్ని నెలల కిత్రం ఒక రోజు.చంద్రహాస్‌ మిత్రుడు సెక్రటరీ అయిన ఆదిత్య ‘‘రసవద్గీత పేరిట చిత్రించిన చిత్రాలకు కేరళ ప్రభుత్వం మూడు లక్షల రూపాయల బహుమతిని ప్రకటించింది’ అనే వార్తను తీసు కొచ్చాడు... ఆ సమయంలో.‘‘ఆదిత్యా... నువ్వు నాకో సహాయం చేయాలి. టీనేజ్‌లో ఉన్న ఓ అందమైన అమ్మాయిని నేను వేయబోయే చిత్రానికి మోడల్‌గా తీసుకురావాలి... తెలుసుగా అందం, నాజూకుదనంతో బాటు కళ్ళు ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండాలి’’.‘‘కొత్త కేన్వాసా. మొన్ననే ఒకటి పూర్తిచేయడం, అమ్మేయడం అయిపోయింది. మళ్ళీ ఇంత వెంటనే... సాధారణంగా కొంత టైము తీసుకుంటారుగా’’.‘‘చూడు ఆదిత్యా. నాకు ఆలోచన రావడమే తరువాయి. భావాలు వెంటనే వర్ణచిత్రాల రూపంలో కేన్వాసుమీదకు రావాల్సిందే. ఆలోచించు’’