ఒకానొకప్పుడు ఉజ్జయినీనగరం సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతూ ఎక్కడెక్కడివారికీ ఆకర్షణీయంగా ఉండేది. అక్కడ స్థిరపడ్డాలన్న ఆశతో సుదీప్తుడనేవాడు ఉన్న ఊళ్లో తనకున్న ఆస్తులన్నీ అమ్మి బంగారు కాసులుగా మార్చుకుని ఉజ్జయినికి వచ్చాడు.సుదీప్తుడు ఉజ్జయినికి చేరుకునేసరికి బాగా చీకటిపడింది. బస చేయడానికి సమీపంలో ఉన్న సత్రానికి వెడితే, సత్రం అధికారి ఖాళీలేదన్నాడు. సుదీప్తుడు ఆయన్ని బ్రతిమాలుతూ, ‘‘అయ్యా! బహుదూరపు బాటసారిని. ఈ రాత్రిపూట ఎక్కడికని వెళ్లగలను? తలదాచుకునేందుకు ఎక్కడైనా ఇంత చోటివ్వండి చాలు’’ అన్నాడు.

‘‘గదులైతే ఖాళీగాలేవు. నీవు బయట పడుకుంటానంటే, నాకేమీ అభ్యంతరంలేదు. కానీ, ఉజ్జయినిలో దొంగలబెడద ఎక్కువగా ఉంది. నీ దగ్గర విలువైన వస్తువులేమైనా ఉంటే జాగ్రత్త!’’ అని హెచ్చరించాడు సత్రం అధికారి. సుదీప్తుడు సత్రం అధికారికి కృతజ్ఞతలు తెలుపుకుని సత్రం నడవలో పడుకున్నాడు. తన దగ్గరున్న బంగారుకాసుల మూటను కౌగిలించుకుని పడుకున్నాక, కాసేపటికి అతడికి ఒళ్లు తెలియని నిద్ర పట్టేసింది.ఒక రాత్రివేళ దొంగ ఒకడు, సత్రం నడవలో ప్రవేశించి, సుదీప్తుడి మూట లాక్కుని బయటకు పరుగెత్తాడు. సుదీప్తుడికి మెలకువవచ్చి వెంటనే, ‘‘దొంగ, దొంగ!’’ అని అరుస్తూ దొంగను తరిమాడు.

దొంగ సత్రందాటి నడిచే బాటమీదకు వచ్చేసరికి, ఆ సమయంలో అలాపోతున్న ఆజానుబాహుడొకడు అతణ్ణి పట్టుకున్నాడు. సుదీప్తుడు చప్పున ఆజానుబాహుణ్ణి కలుసుకొని విషయం చెప్పాడు. ఆజానుబాహుడు సుదీప్తుడి మూటను సుదీప్తుడికిప్పించి, ‘‘మా ఉజ్జయినికి చెడ్డపేరు తెస్తున్న ఈ దొంగను నీ ఇష్టం వచ్చినట్లు చావబాదు’’ అన్నాడు.‘‘నా డబ్బు నాకు దొరికింది. ఈ దొంగమీద నాకు జాలిమినహా ఇంకే భావమూలేదు. వాణ్ణి వదిలి పెట్టండి’’ అన్నాడు సుదీప్తుడు.