‘మడులడిగానా మాన్యాలడిగానా? ఒక పుష్కరస్నానం! మనవడివి నువ్వే నామాట వినకపోతే ఇంకెవరు వింటార్రా నాయనా?’’ అంది బామ్మ. నేనేం మాట్లాడలేదు.‘‘బతికినంత కాలం బతకను. ఏమో ఇదే నా ఆఖరి పుష్కరమేమో!’’.‘‘బామ్మా... సెంటిమెంటు మీద కొట్టకే. కిందటేడు కూడా నన్నిలాగే బ్లాక్‌మెయిల్‌ చేసి గోదావరి పుష్కరాలకు తీసికెళ్ల మన్నావు. తీరా తీసికెళ్లాక నన్నెన్ని తిప్పలు పెట్టావో గుర్తుందా?’’‘‘అవున్రా! వృద్ధాప్యం వస్తే నీకూ తెలుస్తుంది, ఆ బాధలేవిటో!’’‘‘వృద్ధాప్యం బాధల గురించి చెప్పట్లేదు. తీరిగ్గా కూర్చొని చేజేతులా తెచ్చుకున్న కష్టాల గురించి చెబుతున్నా. ‘ఇప్పుడే ఇల్లు కడిగా... మంచం దిగకండి’ అంటూ మా ఆవిడ చెబుతున్నా వినిపించుకోకుండా మంచం దిగి నడవబోయావు. కాలు కాస్తా విరిగింది. ఆ కట్టు వల్లే కదా నడవడానికి లేకపోయిందీ. అందువల్ల అంబులెన్సులో తీసికెళ్లాల్సి వచ్చింది.

 ఖర్చుకి ఖర్చు, యాతనకి యాతన..’’‘‘చాల్లెండింక..’’ అంటూ మధ్యలోకి మా ఆవిడొచ్చింది. కంచంలో బామ్మకి భోజనం తెచ్చిపెట్టింది.తర్వాత తనూ నేనూ భోజనం చేస్తూ బామ్మని ఎక్కడికి తీసికెళ్లాలి, ఎలా తీసికెళ్లాలి అని ఆలోచనలో పడ్డాం. గోదావరి పుష్కరాలంటే, అప్పుడు రాజమండ్రిలో మావయ్యా వాళ్లు ఉన్నారు. ఇప్పుడు కృష్ణా పుష్కరాలకి బెజవాడలో బంధువులెవరున్నారు అని శోధన చేయసాగాం. అయితే బామ్మతో గోదావరి పుష్కరాల అనుభవం మాత్రం పదేపదే గుర్తుకు రాసాగింది.బామ్మ పుట్టి పెరిగిందంతా రాజమండ్రిలోనే. అందుచేత గోదావరి పుష్కరాలు ఎప్పుడొస్తాయా అని ఏళ్ల తరబడి వేళ్లు మడుస్తూ లెక్కపెట్టుకునేది. ఆ నీళ్లూ, ఆ నేలా అన్నీ తనవేననీ, ఎవరు స్నానం చేసినా తన తర్వాతే చెయ్యాలనీ, ముందుగా తనకే ఆ హక్కు ఉందనీ ఆవిడ ఉద్దేశం. అందువల్ల బామ్మని ఎటువంటి పరిస్థితుల్లో రాజమండ్రి తీసికెళ్లక తప్పదని నిర్ణయం అయిపోయింది.

అయితే పుష్కరాలకి పది రోజుల ముందు కాలు విరగ్గొట్టుకుని మంచంపట్టిన కారణంగా కారూ కాదు, రైలూ కాదు ఏకంగా అంబులెన్సే మాట్లాడాల్సొచ్చింది హైదరాబాదు నుంచి.తెల్లవారుజామున నాలుగింటికి అంబులెన్సు, దానితో బాటు ఇద్దరు మనుషులూ వచ్చారు. అందరం కలిసి బామ్మని స్ర్టెచర్‌ మీదయితే పడుకోబెట్టాం గానీ మా మొదటి అంతస్తు నించి కిందికి తీసికెళ్లేసరికి మాకు చుక్కలు కనిపించాయి. ముందూ వెనకా ఇద్దరు పట్టుకున్నారే తప్ప మధ్యలో సహాయంగా మరో ఇద్దరు పట్టుకోడానికి మెట్లు సన్నగా ఉన్న కారణంగా సాధ్యపడలేదు. ముఖ్యంగా మెట్ల మధ్యలో మలుపు తిప్పాల్సిన చోట చాలా ఇబ్బంది పడాల్సొచ్చింది. దానికితోడు స్ట్రెచర్‌ని వాలుగా పట్టుకునే సరికి బామ్మ జారిపోసాగింది. నానాతంటాలు పడి ఎలాగైతేనేం జాగర్తగా దింపి అంబులెన్సులోకెక్కించాం స్ర్టెచర్‌తో సహా.