‘‘ఒరేయ్‌ గోపీ... నువ్వు నాకో అర్జెంటు సాయం చేసి పెట్టాలిరా. నా పేరనున్న మన బందరిల్లు అమ్మేసి... ఖర్చులూ... టాక్సులూ పోను మిగతా దాంట్లో సగం అమ్మానాన్నల పేర నీకు నచ్చిన ధార్మిక సంస్థలకీ.. గుళ్ళకీ విరాళాలుగా ఇచ్చి... మిగతా సగం బ్యాంకు డ్రాప్ట్‌ తీసుకుని నాకు పంపించు. నా వయసు, సహకరించని నా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నేను ఇండియా రాలేక, నీకు అమెరికా నుంచి పవరాఫ్‌ అటార్నీ ఇస్తున్నాను. శ్రమే, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను ఇబ్బంది పెడుతున్నానురా గోపీ!’’ కొరియర్లో వచ్చిన ఆ పెద్ద కవర్లో ఆ చిన్న ఉత్తరం.. నా పేర మా పెద్దన్నయ్య రాంబాబు ఇచ్చిన పవరాఫ్‌ అటార్నీ... ఇంటి దస్తావేజులూ... ఇల్లు అమ్మకానికి అవసరమైన మిగిలిన కాగితాలూ ఉన్నాయి.రాంబాబు ఉత్తరం నన్ను యాభై ఏళ్ళు వెనక్కి తీసికెళ్ళిపోయింది.

‘బందరిల్లు’ నా పేర ఉన్నా.. మన ఇల్లు రా... మన అందరి ఇల్లు’ యాభై ఏళ్ళ క్రితం రాంబాబుది అదే మాట.. ఇవాళ అదేమాట. మా ఆరుగురు అన్నదమ్ముల్నీ.. ముగ్గురు అక్క చెల్లెళ్ళనీ అమ్మానాన్నా కని, పెంచి... పెద్దచేసిన తరువాతే... అప్పుచేసి రాంబాబు కొనగా మా అందరికీ సొంత ఇంట్లో ఉండే అవకాశం.... అదృష్టం కలిగింది.చదువులూ... ఉద్యోగాలూ.. ఆడపిల్లలు పెళ్ళిళ్ళై అత్తారింటికి వెళ్ళిపోవడం... కొన్నాళ్ళు నేనూ... ఆ తర్వాత... నా తర్వాత తమ్ముడూ చాలాకాలం అమ్మానాన్నలని కనిపెట్టుకుని బందర్లో ఉన్నాం. వాళ్ళ టైమొచ్చి... అమ్మానాన్న దర్జాగా సొంత ఇంట్లోంచే స్వర్గస్తులయ్యారు.