చెట్టాపట్టాలేసుకుని, ఒకదాని ఊతంతో ఒకటి రెచ్చిపోతున్నట్టు.. గడ్డకట్టినట్టున్న చీకటీ,గజగజ వణికిస్తున్న చలీ!ఆ రెండింటినీ చీల్చుతున్నవెలుతురు ఈటెలామోటార్‌ బైక్‌హెడ్‌ లైట్‌.

కౌలు డబ్బులు తీసుకుని పల్లె నుంచి బైక్‌ మీద వస్తున్నాడు రమణారావు. ఊళ్ళో పిత్రార్జితంగా అతడి వాటాకొచ్చిన ఎకరం పొలముంది. ఆ భూమి కౌలు డబ్బులు కౌలుదారుతో బ్యాంకు అక్కౌంట్‌లో వేయిస్తానన్నాడు రమణారావు అన్న సత్యం.‘వద్దు.. నేనే వచ్చి తీసుకుంటా’నన్నాడు రమణారావు.అతడికి తాను పుట్టి పెరిగిన ఊరన్నా, నడయాడిన; ఆడిన ఆ మట్టన్నా.. గరువున వేసిన పాతరలోని తేగను దోరగా కాల్చి తేనెలో ముంచి తిన్నంత ఇష్టం. ఆ గాలిని పీల్చి, ఆ మట్టిపై నడిచి, అప్పటి జ్ఞాపకాల్ని నెమరేసుకుంటే.. యాభై ఏళ్ళు దాటిన వేళ కూడా కాలాన్ని ‘వెవ్వెవ్వె’ అని వెక్కిరిస్తూ, నిక్కరెగరేసుకుంటూ తిరిగి పసితనంలోకి దౌడు తీస్తున్నట్టుంటుంది.

నిశిరాత్రి దిగంత రేఖపైకి చేరి, నింగి నుంచి రాలే ఉల్కల్ని దోసిట పట్టాలన్న ఆనాటి ఉబలాటం; పట్టగలమన్న నమ్మకం మనసుకి మళ్ళీ వచ్చినట్టుంటుంది. ఆ మజాని మరోసారి అనుభవించేందుకే ఊరొచ్చాడు. డబ్బులు కౌలుదారు మధ్యాహ్నమే ఇచ్చేసినా.. ఊళ్ళో తిరిగి, చిన్ననాటి మిత్రుల్ని కలిసి తిరుగు ముఖం పట్టేసరికి రాత్రి పదయింది.‘‘ఇంత పొద్దు పోయాక ఏం వెళతావు .. పాతిక కిలోమీటర్ల దూరం.. రోడ్డూ బాగోలేదు. రోజులూ బాగోలేవు. పొద్దున్నే వెళుదువుగాని’’ అన్నాడు అన్నయ్య.‘‘లేదన్నయ్యా.. మా ఫ్రెండ్‌ కొడుక్కి రేపు మా ఊళ్ళో ఏదో ఇంటర్వ్యూ ఉంది. హైదరాబాద్‌ నుంచి పొద్దుటే ట్రైన్లో వస్తాడు. రిసీవ్‌ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళాలి’’ అన్నాడు రమణారావు. ఊయలలో నిదురిస్తున్న అన్న మనవరాలి బుగ్గల్ని చిరుగాలి మొగ్గను తాకినట్టు నిమిరి బయల్దేరాడు.

పిల్లల కంటి మెరుపులో సకల విజ్ఞానాల మూలాల్నీ, వాళ్ళ నవ్వుల్లో అన్ని ఋతువులలో విరిసే పూలనూ చూసే అతడికి ఆ మృదు స్పర్శ.. తన చేతి వేళ్ళకు పట్టిన అదృష్టంలా అనిపించింది.ముఖ్యంగా కృష్ణమూర్తి ఇంటి దగ్గరే రెండు గంటలుండి పోయాడు.పదో తరగతితో చదువాపేసిన కృష్ణమూర్తి వ్యవసాయం చేస్తూ ఊళ్ళోనే ఉండి పోయాడు. పాత పెంకుటింటి స్థానంలో డాబా, రెండెడ్ల బండి స్థానంలో ట్రాక్టర్‌ వచ్చినా.. చిన్నప్పుడు ఆ పెరట్లోని జామ చెట్టు చుట్టూ మార్మోగిన తమ మిత్రబృందం కిలకిలలు ఇంకా సద్దుమణగనట్టు.. కృష్ణమూర్తి ఇంట్లోకి వెళ్లేసరికి హాల్లో వాడూ, రాంబాబు పగలబడి నవ్వుతూ కనిపించారు. బాల్యపు ముచ్చట్లేవో చెప్పుకుంటున్నట్టున్నారు. ముడతలు పడ్డ వాళ్ళ ముఖాల్లో సంతోషం.. ముదురు రావిచెట్లు తొడిగిన లేత కావిరంగు ఆకుల్లా మెరుస్తోంది. రమణారావును చూడగానే.. వాళ్లకు ఆనందం మూడింతలైనట్టు అనిపించింది.