జీవితంలో ఏదో ఒక వృత్తిలో నిలదొక్కుకోవాలనుకున్నాడు చిత్తచిత్రం. ఇహనేం సైకాలజిస్టైపోయాడు . ఓ శుభ ముహూర్తాన బోర్డు తగిలించేశాడు . విజిటింగ్‌ కార్డులూ పంచేశాడు. అతడికి ఆశ్రయమిచ్చిన కందప్ప, విదర్భ దంపతులే చిత్తచిత్రానికి మొదటికేసై కూర్చున్నారు. ఊహించని రీతిలో చిత్తచిత్రం వెంటపడింది విదర్భ ! అదెలా సాధ్యమైంది ? చివరకు చిత్తచిత్రం ఏం చేశాడు?

పట్టుదల తన కాళ్లను కదిలిస్తున్నది! ఆ కదలిక ఎటు అన్నది మనసుకి ఓ మార్గం కనిపించడంలేదు. ఆశ మాత్రం చేతి బిగువులో ఉన్నది!‘‘వెతుకుతున్నదేదో దొరకనివాడిలా, వెతుకుతున్నదేంటో తెలియనివాడిలా ఉంటాడేంట్రా వాడు’’‘‘అని నువ్వనుకుంటున్నావు. అసలు వాడి మనసులో ఏముందో ఎవరు చెప్పలేస్తారు’’.దారిలో వినిపించిన ఆ మాటలు ఎవరో, ఎవరి గురించో శబ్దం చేశాయి.తనని ఉద్దేశించినట్లే అనిపించాయి ఓ క్షణం! ఎందుకంటే తనదీ వెతుకులాటే కాబట్టి. నవ్వుకున్నాడు చిత్తచిత్రం!ఏదో ఓ వృత్తిలో నిలదొక్కుకోవడం తన ముందున్న లక్ష్యం. తను చేరుకోవాల్సిన గమ్యం!

చిత్తచిత్రానికి జీవితకాల కోరిక, విజిటింగ్‌ కార్డు!విజిటింగ్‌ కార్డులు ఇచ్చి పుచ్చుకోవడంలో థ్రిల్లు అంతా ఇంతా కాదనే ఓ నమ్మకం. చిత్తచిత్రం ఓ మానసికవేత్త! చిత్తచిత్రం ఓ మనోవైజ్ఞానిక నిపుణుడు. ఓ మనోవైకల్య పరిశీలకుడు. అలా ఎన్నోరకాలుగా ఆలోచించి చివరికి, చిత్తచిత్రం సైకాలజిస్ట్‌! అని తనపేరుకి తోక తగిలించుకున్నాడు. డర్బన్‌ రిటన్డ్‌ అని తోకకో వెంట్రుకని అంటించాడు. నాలుగువందల కార్డుల్ని ప్రింటు చేయించాడు.

తెలిసినవాళ్ళకీ, తెలియనివాళ్ళకీ పంచడం మొదలుపెట్టాడు.వీడు సైకాలజీ ఎప్పుడు చదివాడు? డిగ్రీ ఎవరిచ్చారు? డర్బన్‌ ఎక్కడుందో కూడా తెలియదే వీడికి! అని అనుకునే వాళ్ళేగాని తెగించి అడిగినవాళ్ళు లేరు, ఆశ్చర్యంతో నోళ్ళు తెరిచి మూసుకున్నారే గాని వివరాల్లోకి వెళ్ళే సాహసం ఎవరూ చేయలేదు! ‘‘సార్‌! మీరు ఇప్పటికే పది కార్డులిచ్చారు’’ అనే వాళ్ళ సంఖ్య మాత్రం దినదిన ప్రవర్థమానమవుతున్నది.

ఓ ఇండిపెండెంట్‌ ఇంటి ముందుగది తన వ్యాపకానికి వేదిక అయింది.అంటే ‘మెంటల్‌ క్లినిక్‌’ తెరిచాడన్నమాట. ‘‘ఎన్నోఏళ్ళుగా వేళ్లాడబడిన టులెట్‌ బోర్డు ఇప్పుడు ఊడి పడినట్లుందే’’ వీధిలో వెళ్ళే ఓ గొంతు వినిపించింది, అది తనకనవసరం.