అది ప్రభవనామ సంవత్సరం, మాఘపూర్ణిమ పంచమాధవాల్లో ఒకటైన కుంతీ మాధవస్వామి కళ్యాణానికి ఏర్పాట్లన్నీ వైభవంగా జరిగాయి. ఊరు ఊరంతా గుడి దగ్గరే కల్యాణ ఘడియల కోసం వేచి ఉంది. ప్రాకారం బయట ఆడవాళ్ళొకవైపూ, మగవాళ్ళొకవైపూ నిల్చున్నారు. వాళ్ళ మధ్యలో కన్నులపండువగా నిలబడి ఉంది స్వామివారి రథం. సర్పవరం నుండీ కడియం నుండీ తెచ్చిన రకరకాల పూలతోనూ, మరువం, దవనంవంటి లతలతోనూ స్వామివారి రథం, ఉత్సవ విగ్రహాలు శోభాయమానంగా అలంకరించ బడి ఉంది. దివాన్‌ దాసీలు పూజాసామగ్రి బుట్టలతో ఓ పక్కగా నిలబడి ఉన్నారు. రాతిగోడలకు వేలాడుతున్న కొక్కాలకు తగిలించిన కాగడాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. మధ్య మధ్యలో వాటిలోకి ఆవనూనె పోస్తున్నారు.

గుడి ముందరి వీథిలో పెద్ద మసీదు పక్కగా ఉన్న దుకాణాల్లో కొబ్బరికాయలూ, అరటి పళ్ళూ, తమలపాకులూ ఇతర పూజాసామాగ్రి అమ్ముతున్నారు. ఆ పక్కనే గాజుసీసాల్లో పిల్లలు తినే పంచదారతో చేసిన నిమ్మతొనలు, బల్లిగుడ్లు, పాకంజీళ్ళూ ఉన్నాయి. గుడినుండి కోనేటికి వెళ్ళేదారిలో రోడ్డుకి రెండువైపులా రకరకాల సామాన్లు అమ్మే అంగళ్ళున్నాయి. రాతితో చేసిన రోకళ్ళూ, రుబ్బురోళ్ళూ, సన్నికాళ్ళు, తగరం గిన్నెలూ, పిల్లలాడుకునే కొండపల్లి కొయ్యబొమ్మలూ, ఏటికొప్పాక, లక్కబొమ్మలూ, మాడుగుల హల్వావాళ్ళూ, ఆత్రేయపురం పూతరేకులవాళ్ళూ, తాపేశ్వరంకాజాలవాళ్ళూ, తురకదేశాల నుండి తెప్పించిన ఖర్జూరం అమ్మే వాళ్ళూ తాటాకులతో చిన్నచిన్న పందిళ్ళు వేసుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు.

గుడికి అరమైలు దూరంలోఉన్న ఉమరాలీషా కవిగారింటి దగ్గర్నుండి మొదలు, ఫ్రెంచివాళ్ళ బలిజపేటవరకూ జనమే జనం తూర్పున ఉప్పాడ, పడమట ఏలేశ్వరం, ఉత్తరాన గొల్లప్రోలు, దక్షిణాన కాకినాడ–సామర్లకోటవైపుల నుండీ, ఇతర పొరుగూళ్ళ నుండీ ఒంటెద్దు బళ్ళమీదా, కాలినడకనా, మరికొందరు మగాళ్ళు ర్యాలీసైకిళ్ళమీదా భక్తితోనూ, ఉత్సాహంగానూ తరలి వస్తున్నారు. వాళ్ళలో కొందరు తురకలూ, క్రైస్తవులూ ఉన్నారు.

వస్తున్న జనం కాకినాడరోడ్డులో ఉన్న కోనేట్లో కాళ్ళూ, చేతులూ కడుక్కుంటున్నారు. కళ్ళు మూసుకుని నీటికి దణ్ణాలు పెట్టుకుని మూడుసార్లు ఆ నీటిని తలమీద చల్లుకుంటున్నారు. కోనేటికి చుట్టూ కట్టిన గట్టుమీద ఓ మూలగా పెద్దాపురం నుండొచ్చిన భోగంమేళంవాళ్ళు తాపీగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. ఊళ్ళోని కొందరు మోతుబరులు ఆ గట్టుమీదే మరోపక్క నిలబడి చూపులతోనే వాళ్ళను తినేసేట్టు చూస్తున్నారు.