రైలు బెంగుళూరుకి మూడు గంటలు ఆలస్యంగా చేరింది.జగదీశ్‌ హడావిడిగా ఆటో ఎక్కి రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కి దగ్గరలో ఉన్న లాడ్జ్‌కి వెళ్ళాడు. రూమ్‌ తీసుకున్నాక టీ కూడా తాగకుండా చకచకా బయటపడ్డాడు.బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్న కొడుకుకోసం అక్కడే ఒక ఫ్లాట్‌ కొన్నాడు జగదీశ్‌. ఏడాది తరువాత కొడుక్కి తామున్న హైదరాబాద్‌లోనే ఇంకా మంచి ఉద్యోగం రావడంతో, వెనక్కి తిరిగి వచ్చేశాడు. దాంతో బెంగళూరులోని ఆ ఫ్లాట్‌ని అద్దెకి ఇచ్చాడు జగదీశ్‌. ఇప్పుడు ఆ పనిమీదే బెంగళూరు వచ్చాడు జగదీశ్‌.

ఆ ఫ్లాట్‌ పక్కనే మల్లికార్జునప్ప ఫ్లాట్‌ ఉంది. పక్కనున్న జగదీశ్‌ ప్లాట్‌ని కొనేసుకుని కలుపుకుంటే తన ఇల్లు ఇంకా విశాలంగా సౌకర్యంగా ఉంటుందనుకున్నాడు మల్లికార్జునప్ప. జగదీశ్‌ సరే అన్నాక వ్యవహారం మాట్లాడుకోవటానికి మల్లికార్జునప్ప మూడునాలుగుసార్లు హైదరాబాద్‌ వచ్చాడు. ‘‘కాగితాలన్నీ తయారుచేసుకుని ఇక ఎగ్రిమెంట్‌ రాసుకుందాం’’ అనుకున్న సమయంలో, ‘ఇప్పుడెందుకు అమ్మటం..’ అనే ఆలోచన వచ్చింది జగదీశ్‌కి. దాంతో మెలిక పెట్టాడు. రెండు ఫ్లాట్లు కలిపి మార్పులూచేర్పులూ చేయడానికి ఆర్కిటెక్ట్‌తో దీర్ఘంగా చర్చించి ఒకపక్కా డిజైన్‌ నిర్థారించుకున్న తర్వాత, ఈ పితలాటకం ఏమిటో అర్థంకాక మల్లికార్జునప్ప లబోదిబో అన్నాడు.

జగదీశ్‌ని ఒప్పించటానికి మల్లికార్జునప్ప తిప్పలుపడి ఫ్లాటు ధరను ఇంకో తొమ్మిది లక్షలు పెంచాడు.జగదీశ్‌ కొడుక్కి ఇలాంటి వ్యవహారజ్ఞానం లేకపోవటంతో తండ్రి తెలివితేటలకు అతడు ఆశ్చర్యపోయాడు. ‘‘లౌక్యం అంటే ఇదే మరి! ‘ఆ ఫ్లాట్‌ ఇప్పుడే అమ్మాల్సిన అవసరం నాకు లేదు.. నేను అనుకున్నధర వచ్చేవరకూ ఆగి వేరేవాళ్ళకి అమ్ముతాను’ అని మల్లికార్జునప్పను బెదిరించాను. నిజానికి ఆ ఫ్లాట్‌ కొనుక్కోవడంవల్ల అసలైన ప్రయోజనం పొందేది ఆ మల్లికార్జునప్పే! ఎదుటివాడికి అవసరం ఉన్నప్పుడు ఎక్స్‌ప్లాయిట్‌ చేయటంలో తప్పేముంది? అలా ఇప్పుడు అతగాడినుంచి తొమ్మిదిలక్షలు ఎక్కువ రాబడుతున్నాను!’’ అన్నాడు కొడుకుతో జగదీశ్‌ సగర్వంగా.