గాయత్రినగర్‌లో జనం పెద్దఎత్తున చేరారు.పోలీసులు వారిని కంట్రోల్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈలోపు రయ్యిమంటూ దూసుకొచ్చిన పోలీసుజీపులో నుంచి పోలీసుడాగ్‌ స్నూపీ కిందకు దూకింది. దాని వెనుక డాగ్‌ హ్యాండ్లర్‌ మహేష్‌ కూడా కిందకు దూకాడు.‘‘చూడు మహేష్‌ ... ఇక్కడో హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అరుణ అనే మహిళను హత్య చేసి పారిపోయారు.

క్లూస్‌ ఏమైనా దొరుకుతాయేమో ప్రయత్నించు. గో ఎహెడ్‌’’ అంటూ స్నూపీ తల నిమిరాడు ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు.అరుణ మృతదేహం పడి ఉన్న చోటుకి స్నూపీని తీసుకువెళ్లాడు మహేశ్‌. కాళ్లు చేతులు కట్టేసి మెడకు కేబుల్‌ వైరుతో ఉరి బిగించి అరుణను హత్య చేసారు. అత్యాచారం చేసి హత్య చేసినట్లు స్పష్టమవుతోంది.అరుణ మృతదేహం చుట్టూ తిరిగి వాసన చూసిన స్నూపీ అక్కడ ఉన్న బెడ్‌ పైకి జంప్‌ చేసింది. ఆ తర్వాత కిచెన్‌లోకి పరుగుతీసింది. సింక్‌ దగ్గర ఉన్న టీ కప్పులను వాసన చూసింది. అక్కడి నుంచి ఇంటి బయటకు వెళ్లి బస్టాప్‌ దగ్గర ఆగింది. 

తర్వాత తిరిగి అరుణ ఇంటి దగ్గరకు పరుగు తీసింది. తలుపుల వద్ద కొద్దిసేపు వాసన చూసి మళ్లీ పరుగు ప్రారంభించింది స్నూపీ. దాదాపు రెండు కిలోమీటర్లు పరుగెత్తి ఒక ప్రింటింగ్‌ ప్రెస్‌ వద్ద ఆగిపోయింది.ఆ ప్రింటింగ్‌ ప్రెస్‌లోనే అరుణ పనిచేస్తుంది. ప్రెస్‌ నుంచి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లింది. రెండు గంటలైనా ప్రెస్‌కు తిరిగి రాకపోవడంతో ఆమెను పిలుచుకు వద్దామని ఆమె ఇంటికి వెళ్లిన సహోద్యోగి రాజు ఇంట్లో అరుణ మృతదేహాన్ని చూసి నివ్వెరపోయి పోలీసులకు ఫిర్యాదు చేసాడు.గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామానికి చెందిన అరుణ భర్త పీటర్‌, ఇద్దరు ఆడపిల్లలతో కలిసి చాలా సంవత్సరాల క్రితం హైదరాబాద్‌ కు వలస వచ్చింది. అరుణ ఒక ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేస్తుండగా, ఆమె భర్త పీటర్‌ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె పెద్ద కుమార్తె బీటెక్‌ చదువుతుండగా, చిన్న కుమార్తె ఏడో తరగతి చదువుతోంది. చిన్న కుటుంబం... చింతలు లేని కుటుంబం. అలాంటి అరుణ మిట్టమధ్యాహ్నం తన ఇంట్లోనే హత్యకు గురైంది. హత్యకు ముందు ఆమెపై అత్యాచారం జరిగిన ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి.