డిసెంబర్‌ నెలలో ఉండాల్సినంత చలిలేదు. సూర్యకిరణాలు ఇంకా వేడెక్కలేదు. అందుకే ఈ ఉదయం ఆహ్లాదకరంగా ఉంది. ఆదివారం కనుక ఆఫీసుకెళ్ళే తొందర కూడా లేదు. మనసుకు విశ్రాంతిగా ఉంది.ప్రతీ ఆదివారం ఒక మంచి పుస్తకం చదవడం అలవాటు నాకు. రావూరి భరద్వాజగారి ‘‘పాకుడురాళ్ళు’’ పుస్తకం తీసుకుని పైన నా గదిలో కిటికీ దగ్గర కూర్చున్నాను. గోల వినపడ్డంతో విశాలంగా ఉండే కిటికీలోంచి కిందకి చూశాను. నా కొడుకు అనూప్‌, వాడి స్నేహితులు కుర్చీలు వేసుకుని తోటలో క్యారమ్స్‌ ఆడుతున్నారు. నూనూగు మీసాల యవ్వనంతో తుళ్ళింతలాడుతున్నారు.ఏ బాదరబందీ లేని వయసు. కేరింతలాడుతున్నారు. ఇంకో రెండేళ్ళలో ఈ యువకులంతా కంప్యూటర్లముందు చలనంలేని జీవితాలకు బలవుతారనే తలంపే నాకు బాధ కలిగించింది. అనూప్‌ బాగా చదువుతాడు. డిగ్రీ చదివించి సివిల్స్‌కు పంపాలని, ఆదర్శవంతమైన కలెక్టర్‌ను చేయాలనే నా ఆశను వాడు ఆశయంగా తీసుకోలేదు. కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌పై వాడికున్న ఆసక్తిని తండ్రిగా నేను గౌరవించాల్సివచ్చింది. నా చూపులు, ఆలోచనలు పిల్లలపైనుండి మరల్చి పుస్తకంలోకి తల దూర్చాను. అరవై, డెబ్భైల మధ్యకాలంనాటి తెలుగు సినిమారంగం నేపథ్యంగా కథానాయిక మంజరి జీవితచరిత్ర ఆసక్తికరంగా ఉంది.

ఇక అందులో లీనమైపోయాను.అకస్మాత్తుగా అనూప్‌ అతని స్నేహితులమధ్య ఓ భిన్నస్వరం వినపడటంతో తలతిప్పి కిందికి తోటలోకి చూశాను. పాప్‌కార్న్‌ అమ్మే ఓ ముసలాయన తన పెద్ద మూట పిల్లలముందు పెట్టాడు. అక్కడున్న ఆరుగురికీ పేపర్‌కవర్లలో ఒక డబ్బాతో పాప్‌కార్న్‌ వేసిచ్చాడు. అతనికి ఎనభైదాకా వయసుంటుంది. కుర్రాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాడు. నేనూ ఆసక్తిగా వింటున్నాను.‘‘రోజుకు ఎన్ని మూటలు అమ్ముతావు తాతా?’’ అనూప్‌ అడిగాడు.‘‘ఎన్నో ఎక్కడ నాయనా! ఒక్కమూట అమ్మేసరికి నా ఊపిరి పోతుంది’’ ముసలాయన భుజం మీది తుండు తీసుకుని ముఖం తుడుచుకున్నాడు.‘‘ఎంత సంపాదిస్తావేంటి?’’ మరో పక్కనుంచి వచ్చింది ప్రశ్న.‘‘ఇయ్యన్నీ అమ్మితే నూరు మిగులుతుంది నాయనా!’’‘‘అన్నీ అయిపోతాయా? మిగలవా? మిగిలితే మెత్తగా అయిపోతాయికదా, ఎవరు కొంటారు?’’ రఫిక్‌ మంచిప్రశ్న వేశాడు.‘‘బట్టీ కాణ్ణించి అటే అమ్మడానికి పోతాబాబూ, మధ్యాన్నంకల్లా అయిపోతాయి. చల్లకాలం ఒక్కోసారి మిగిలిపోతే మేమే ఇంట్లోకి వాడుకుంటాం’’.