ఒకలాంటి విషాదం ఆయన చుట్టూ. ఆయన దగ్గర ఒకరకమైన ముసలివాసన. ఆలనా పాలనా పట్టించుకునే వాళ్ళు లేక, శరీరం మీద శ్రద్ధ పోయి ఏ పని చేయడానికి కూడా తనువు సహకరించని దుర్భలత్వం తాలూకూ ముసలి వాసన అది. తెల్లటి లాల్చీ పైజమాలో తెల్ల పావురంలా వుండే ఆయన్ని ఇలా చూస్తూంటే ఒకరకంగా బాధగా వుంది.

ఆయన రెండు కాళ్ళు పైకెత్తి సోఫాలో బాసింపట్టు వేసుకుని కూర్చున్నాడు. ఐశ్వర్య అల్లిన మల్లెపూవు లాంటి సోఫా కవర్‌పై లేత ఎరుపు రంగు మట్టిచార. గీసుకోని గడ్డం, మాసిన లాల్చీ పైజమా, తైల సంస్కారం లేని జుట్టు, నాలుకకీ మెదడుకీ మధ్య లోపించిన సమన్వయంతో తడబడే మాటా -ఆయన శబ్దం చేస్తూ కండువాలోకి చీదాడు. డైనింగ్‌ టేబిల్‌ దగ్గర గిన్నెలు సర్దుతున్న ఐశ్వర్య నావంక ఎర్రగా చూసింది. ఆమె చూపుల్ని గమనించనట్టు చూపు తప్పించాను. పాప ఆయనవంకే వింతగా ఆసక్తితో చూస్తోంది. చాలాకాలం తర్వాత కలవడం వల్లనేమో ఏం మాట్లాడాలో తోచని తనం ఇద్దరి మధ్యా.‘‘అయితే మొత్తానికి హైదరాబాదులోనే ఉన్నావన్నమాట’’ మౌనాన్ని మాష్టారే కదిలించారు. అవునన్నట్టు తలూపాను. మాష్టారు హాలంతా కలయజూస్తుంటే నేనూ అటే చూపుల్ని పోనిచ్చాను. టీపాయ్‌ మీద ఫెంగ్‌షుయ్‌ బాంబూ ట్రీ. నేనున్న సేఫ్‌ జోన్‌ చెదరకుండా ఐశ్వర్య చేసిన ఏర్పాటు. దాని పక్కనే గంటల పంచాంగం.

హాలుకి ఒక మూల దేవుడి మందిరం. గోడకి దేవుళ్ళ పటాలు. ఆయన ఒకొక్కదాన్ని చూస్తున్న కొద్దీ నా మొహం నల్లగా అవడం నాకు తెలుస్తోంది.రామచంద్ర మాష్టారింట్లో నేను నేర్చుకున్న దానికీ ఇప్పుడు నా జీవిత విధానానికీ ఏ మాత్రం లేని పొంతన నన్ను ఇబ్బంది పెడుతోంది. వ్యక్తుల కారణంగా దేని విలువ అయినా పెరగడం తగ్గడం అనేది ఉంటుందని అప్పటివరకూ నాకు తెలీదు. ఆయన మా ఇంటిని పరీక్షగా చూస్తున్న కొద్దీ నా మొహం అవమానంతో నల్లగా అవుతోంది. ఇంటిముందు కారు ఆగగానే డ్రైవర్‌ పరిగెత్తుకువచ్చి డోర్‌ తెరిచినప్పుడు మొదలైన ఆ నలుపు ఉన్నకొద్దీ మొహానికి మసిపూసినట్టు దట్టంగా అలుముకుంటోంది. ఆ నలుపు ఇప్పటిదా? నా భుజాల చుట్టూ వేసిన ఆయన చేతిని తప్పించుకుని నేను సేఫ్‌ జోన్‌లో అడుగుపెట్టినప్పుడే బహుశా అది కూడా మొదలయిందేమో?