నా క్లోజ్‌ ఫ్రెండ్‌ ఒంగోలులో గుండె జబ్బుల హాస్పిటల్‌ ఓపెనింగ్‌కి నన్ను పిలిచాడు. గుంటూరు, విజయవాడ, తెనాలి, చీరాల చుట్టుపక్కల ఉంటున్న మా ఫ్రెండ్సంతా వచ్చారు. మేమంతా డిగ్రీలు, పీజీలు పూర్తిచేసి దొరికిన పని చేసుకుంటున్నాం. మాలో ఎవ్వరికీ కార్లు లేవు. అప్పట్లో కారంటే అంబాసిడర్‌, ప్రీమియర్‌ పద్మిని. కారు ఒక సోషల్‌ స్టేటస్‌. ఆ మాటకొస్తే ఒక్కరిద్దరికి తప్ప స్కూటర్లు కూడా ఎవ్వరికీ లేవు. మేమంతా ఎర్రబస్సెక్కి ఒంగోలు చేరాం. అప్పటికే ఎండలు మండిపోతున్నాయి.హాస్పిటల్‌ ఓపెనింగ్‌ ఫంక్షన్‌కి డా. సోమరాజుగారు చీఫ్‌ గెస్ట్‌గా వచ్చారు. కోకోనట్‌ బ్రేకింగ్‌, రిబ్బన్‌ కటింగుల్లాంటి ఫార్మాల్టీస్‌ అయ్యాయి. వచ్చిన గెస్టులు, డాక్టర్లు, విలేకర్లతో ఇంటరాక్షన్‌ మీటింగు ఏర్పాటుచేశారు.ఈ చుట్టుపక్కల అదే ఫస్టు హార్ట్‌ హాస్పిటల్‌! అటు నెల్లూరు నుంచి ఇటు గుంటూరు దాకా! ఈ చుట్టుపక్కల పేషెంట్స్‌కి పేయింగ్‌ కెపాసిటీ తక్కువ. హార్ట్‌ హాస్పిటల్‌ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. 

బోలెడు ఖర్చు. ఎక్విప్‌మెంట్‌ చాలా కాస్ట్‌లీ. అందుకే ఇంతవరకు ఎవ్వరూ ముందుకు రాలేదు.ఆ విషయాన్నే డా. సోమరాజుగారు చెబుతూ ‘‘ఎలాంటి గుండెజబ్బులొచ్చినా ఈ చుట్టుపక్కల జనం దేవుడి మీద భారం వేసేవాళ్లు. సకల జీవులకు జీవం పోసేది కనబడని దేవుడైనా, జబ్బులొస్తే ప్రాణాలు కాపాడేది మాత్రం డాక్టర్లే. అందుకే డాక్టర్లను దేవుడితో పోలుస్తారు. ఈ విషయం డాక్టర్‌ వృత్తి చేపట్టిన ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఎంతో వ్యయప్రయాసల కోర్చి అమృతంలాంటి ఈ హార్ట్‌ హాస్పిటల్‌ను సేవాభావంతో ప్రారంభిస్తున్న ఈ డాక్టర్‌ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’’ అని చెప్పి ముగించాడు.

ఆ డాక్టర్‌గారు మాట్లాడే టైంలో మా గ్రూపంతా వెనకచేరి జోకులేసుకుని నవ్వు కుంటున్నాము. డాక్టర్‌ సోమరాజుగారి మాటలు సూటిగా మాకే చెప్పినట్టనిపించింది. మీటింగ్‌ అయిపోయింది. అందరం బయటపడ్డాం.‘‘ఇవేం ఎండల్రా బాబూ‌!’’ ముఖానికి పట్టిన చెమటను హ్యాండ్‌ ఖర్చీఫ్‌తో తుడుచు కుంటూ అన్నాడు మురళి.‘‘ట్రైల్‌పార్టీ ఇలా ఉంటే, ఇంక మెయిన్‌ పిక్చర్‌ ఇరగదీస్తదేమో!’’ అన్నాడు కిరణ్‌, ఏప్రిల్‌ మే నెలలను ఊహించుకుంటూ.