గత సమ్మర్‌లో వేకువజామునే ఒకరోజు విశాఖలో మొదలైన మా సికింద్రాబాద్‌ రైలు ప్రయాణం సాయంకాలం నాలుగింటివరకూ ఒక మోస్తరు బాగానే సాగింది. ఎప్పుడైతే మా థర్డ్‌ ఎసిలో ఎసి పని చెయ్యకుండా మారాం చేసిందో అప్పుడే మొదలయ్యాయి ఆ బోగీలో కష్టాలన్నీ. కంపార్టమెంట్‌ నిండా సఫకేషన్‌, పైగా సీలింగ్‌ ఫాన్‌ విసురుతున్న వేడిగాలి మండుతున్న కొలిమినుండి వస్తున్నట్టుంది. ఎసి ఆగిపోయి అరగంటైనా రెస్టోర్‌ చెయ్యడానికి ఎవరూ రావడం లేదు.ఎండిపోయిన చెరువులో చేపపిల్లల్లా పెద్దలూ పిన్నలూ విలవిలలాడుతున్నారు. నేను నాలుగేళ్ళ మా లావణ్యను లాలిస్తూ, బుజ్జగిస్తూ నానాయాతనలు పడుతున్నాను. ఓపిక నశించి దిక్కులు చూస్తుండగానే సాయంత్రం ఆరు దాటింది. కాసేపటిలో సికింద్రాబాద్‌ అవుటర్‌లో ట్రైన్‌ మెల్లగా ముందుకు పోతుంటే అందరూ క్యూ కడుతున్నారు. మామయ్యగారు రెండు సూట్‌కేసులు మోసుకుంటూ బండి దిగి పాపని అందుకున్నారు.ప్లాట్‌ఫాం బెంచీపై కూలబడగానే ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్లయింది. దగ్గరిలోవున్న వాష్‌ బేసిన్‌లో నేనూ మా పాప ఫ్రెష్‌ అయ్యాం కాని ప్రయాణ బడలిక వదలలేదు. కొత్త వాటర్‌బాటిల్‌ తెచ్చుకుని చల్లటి నీటితో ఉపశమనం పొందాం. మావారింకా స్టేషన్‌ చేరుకోలేదు.

‘‘ఇదిగో వచ్చేస్తున్నాను, టాంక్‌బండ్‌ దాటాను’’ అని ఫోన్‌ చేసి అరగంట దాటినా మనిషి కనిపించటం లేదు. మాతో దిగినవారంతా హాయిగా ఇళ్ళకు వెళ్ళిపోయారు. మామయ్యగారు లైసెన్స్‌ కూలీ కోసం వెతుకుతుంటే మేము వెనక్కు చేరబడ్డాం.ఏవో మాటలు వినబడుతుండగా లేచాను. కూలీ దొరికినట్లున్నాడు. మా లగేజిని బయట పార్కింగ్‌ వద్దకు చేర్చాలని కూలీతో చెప్తుండగా నేనటువైపు చూశాను. ఆ కూలీ అవతారం చూసి అవాక్కయ్యాను. నల్లని ముఖంతో వికృతంగా అచ్చం దొంగలా కనబడుతున్నాడు. పైగా లైసెన్స్‌ కూలీలు సాధారణంగా వేసుకునే ఎర్రరంగు బట్టలైనా లేవు. మొత్తానికి నాకు సదభిప్రాయం కలగటం లేదు.