భర్త మరణించడంతో ఆ చిన్న ఉద్యోగం కూతురికే వేయించింది తల్లి. కొడుకు ఐ.ఎ.ఎస్‌ పాసై పెద్ద అధికారి అయిపోతాడనుకుందామె. కానీ పదేళ్ళు గడిచిపోయినా ఆ కొడుకు ప్రయోజకుడు కాలేకపోయాడు. ఇక ఆ కూతురు సంపాదనే తల్లికి ఆధారమైంది. అంతలోనే తల్లీ కూతుళ్ళ మధ్య గొడవలొచ్చాయి. మరి ఆ గొడవలు ఎలా సద్దుమణిగాయి? ఆ కొడుకు ప్రయోజకుడయ్యాడా? లేదా?

ఆ ఊరు మంచుదుప్పటి కప్పుకున్నట్లు వణుకుతోంది. అదేం విచిత్రమోగాని అక్కడ ఎండలూ ఎక్కువే, చలికూడా ఎక్కువే. అయితే చలికాలంలో ఆ ఊరు అందంగా అలంకరించుకుంటుంది. ఎటుచూసినా పుష్పించేవనాలతో కళ్ళకు అందాలవిందు చేస్తుంది ఆ ఊరు. ప్రతి ఇంటిముందు అక్కడ కనీసం బంతిపూలైనా కనిపిస్తాయి. నవ్వు మొఖంతో పలకరిస్తుంటాయి. పెద్దపెద్ద దాలియాలు, రంగురంగుల గులాబులు, ఇంకా పేరు తెలియని వింత వింత పుష్పాలతో ప్రతిమొక్కా సంతోషంగా ఉంటుంది.అంత అందమైన వాతావరణంలో కూడా ఎందుకు కొందరు దుఃఖాన్ని వేటాడి సొంతం చేసుకుంటారో ఎవరికీ అర్థం కాదు. అన్నీ సాదాసీదాగా ఉంటే మజా ఏముంటుంది అనుకుంటుందేమో విధి. కొందరిని ఆశ వెంట పరుగెత్తిస్తుంది. మరికొందరిని దురాశ చుట్టూ గిరికీలు కొట్టిస్తుంది. అయితే ప్రకృతి ఉన్నంత అందంగా మానవనైజం కూడా ఉంటే ఎంత బాగుంటుంది.

అలాగే ఉంటే ఇక అది స్వర్గమే కదా!అరోజు గుడిలో పూజారిగారితో కాస్త ఏకాంతంగా మాట్లాడాలని మాయ వేచి ఉంది. తన సమస్యలు ఆయనతో చెప్పుకుని ఊరటపొందడం అనే అలవాటు ఆమెకు పెళ్ళై ఆ ఊరు వచ్చినప్పటి నుంచి ఉంది. అప్పట్లో ఆ పూజారికి నలభైయేళ్ళు ఉండేవేమో. మాయకు పెళ్ళై ఇప్పటికి ముప్ఫై రెండేళ్ళు. ఆమెకు ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు పేరు కాళిదాసు, కూతురు కృష్ణ.ఆమె భర్త ఇప్పుడులేడు. అతను గతించి తొమ్మిదేళ్ళు అవుతోంది. ఆయనపేరు ఆమె ఎప్పుడూ పలకలేదు. ఇప్పుడు పలకవలసిన అవసరం కూడా లేదు.ఆ ఊరిలో ఎక్కువగా కాళీమాతమందిరాలే ఉన్నాయి. కొన్ని మందిరాలలో కాళీ భయంకరరూపంలో దర్శనం ఇస్తుంది. కానీ ఈ గుడిలో అమ్మవారు సౌమ్యరూపంలో దర్శనం ఇస్తుంది.