అందమైన లోనావాలా భూషీ డామ్‌ పరిసరాల్లో వాళ్ళిద్దరూ చేతిలో చెయ్యేసుకుని నడుస్తున్నారు. అతనూ ఆమే కొన్ని రోజులుగా ఈ నిర్జన ప్రాంతంలోనే రహస్యంగా కలుసుకుంటున్నారు. రెండు నెలల క్రితం ఇక్కడ్నించే ఓ పశువుల కాపరి బెదిరిపోయి పారిపోయాడు.

ఇన్‌స్పెక్టర్‌ చంద్రకాంత్‌ జాదవ్‌ వచ్చి చూసి, ‘సూసైడా?’ అని అడిగాడు.‘లేదు సార్‌, గాయాలున్నాయి!’ అన్నారు సిబ్బంది నగ్న మృతదేహాలని పరీక్షగా చూస్తూ.ఒకమ్మాయి, ఒకబ్బాయి - కత్తిపోట్లతో శవాలై. పక్కనే కుప్పగా పడేసిన బట్టలున్నాయి. దూరంగా బైక్‌ ఉంది. బట్టల్లో మొబైల్స్‌, పర్సులు, ఐడీలూ ఏవీ లేవు. ఆమె ఒంటి మీద నగలేమీ లేవు. డబుల్‌ మర్డర్‌ కేసు నమోదు చేశాడు చంద్రకాంత్‌. డాక్టర్‌ రిపోర్టులో లైంగిక దాడి ప్రస్తావనేదీ లేదు. కేవలం దోపిడీ కోసం జరిగిన హత్యలని రాశాడు. దోపిడీ కోసమైతే శృతి, సార్ధక్‌ల బట్టలెందుకు తీయించారు? పుణె ఎస్పీ సువేజ్‌ హక్‌ సీరియస్‌గా తీసుకున్నాడు దీన్ని. బట్టలు తీయించి దోపిడీలకి పాల్పడే కేసులు ఇప్పటి వరకూ లేవు.‘‘పోయిన మొబైల్స్‌ని ట్రాక్‌ చేయండి’’ అని ఆదేశించాడు. మొబైల్‌ ట్రాకింగ్‌ ఎటూ దారితీయలేదు.

ఇటు లోనావాలాలో బృందాలుగా పోలీస్‌ టీములు తిరగసాగాయి. వాళ్ళ దృష్టికి ఓ సమోసావాలా వచ్చాడు.‘‘క్యా భాయ్‌, డామ్‌ దగ్గర సమోసాలు అమ్మట్లేదా?’’ అనడిగారు.అతను అదోలా నవ్వి, ‘‘అక్కడికి మనుషులే పోరు, సమోసాలేం పోతాయి’’ అన్నాడు.‘‘నీ బాస్‌ కన్పించడం లేదే?’’‘‘ముంబాయి వెళ్లుంటాడు పని మీద’’‘‘నీ దోస్తు?’’‘‘మహెబూబా కాడికెళ్ళాడు, హైదరాబాద్‌’’‘‘మూణ్నెల్లయింది కదూ నువ్వు లోపలికెళ్ళొచ్చి?’’ఇలా వీలున్నప్పుడల్లా సమోసావాలాతో బాతాఖానీ వేసుకోసాగారు టీం. కానీ ఎక్కడా బయటపడడం లేదు క్రిమినల్‌ రికార్డున్న సమోసావాలా.ఫ ఫ ఫనెలరోజులు గడుస్తున్నా ఏ పురోగతీ లేకపోవడంతో, ‘సిట్‌’ ఏర్పాటు చేశాడు ఎస్పీ. సీక్రెట్‌ సర్వీస్‌ ఫండ్‌ లోంచి యాభై వేల బహుమానం ప్రకటించాడు.

లోనావాలా ప్రజలతో లోకల్‌ హ్యూమన్‌ నెట్వర్క్‌ ఏర్పర్చుకోవాలన్నాడు. సరైన సమాచారం అందించిన వారికి ఈ బహుమానమని చెప్పాడు. క్రైం బ్రాంచ్‌, సైబర్‌ పోలీస్‌, సైబర్‌ సెల్‌, రూరల్‌ పోలీస్‌ అధికారులు 14 మందితో ఎనిమిది టీములు ఏర్పడ్డాయి. మృతుల బంధువులు, స్నేహితులు సహా రెండు వేలమందిని క్షుణ్ణంగా విచారించారు. లక్షన్నర కాల్‌ రికార్డ్స్‌ని విశ్లేషించారు. స్పెషల్‌ ఐజీ విశ్వాస్‌ ఈ మొత్తాన్నీ స్వయంగా పర్యవేక్షించసాగాడు. కానీ నెల గడుస్తున్నా, ఇంత విస్తృత దర్యాప్తు కూడా ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా వుంది.