ఊరుగాని ఊరు. భాషగాని భాష. కొత్త ఉద్యోగం . పైగా బాస్‌ అంటే మహాభయం. కొత్తగా పెళ్ళొకటైంది. వీలైనంతవరకు బాసుని తప్పించుకుని తిరుగడమే మేలనుకున్నాడతను. ఓసారి కానిసమయంలో ఎదురయ్యాడు బాసు. అతడిని తప్పించుకోడానికి ఓ కారు పక్కన నక్కి కూర్చున్నాడు. అంతలో బాసు చూడనేచూశాడతన్ని. ఇక అప్పుడు మొదలైంది అసలు తంటా! అక్కడే మలుపు తిరిగింది కథ!

‘సెవెన్‌ కలర్స్‌ స్పెక్ట్రం’ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పార్కింగ్‌ ప్లేస్‌!సాయంత్రం ఆరున్నర!ఇంటికి వెళ్ళడానికి బయటకు వచ్చాను.ఆరునెలల క్రితమే ఈ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా జాయినయ్యాను. జూనియర్‌ పొజిషన్‌!కొత్త ఉద్యోగికి ఉండే బెరుకు నాలో తగ్గలేదు. పైగా భాష సమస్య. హిందీ సరిగారాదు. నట్టుతూ నట్టుతూ మాట్లాడుతాను. మా ఊరి పిల్లకాలువల్లో బూడిదరంగు నీటి ప్రవాహంలా నా ఇంగ్లీష్‌ కూడా నెమ్మదిగా రుచిహీనంగా పేలవంగా ఉంటుంది. ఇంకా ‘ఫ్లో’ పట్టుబడలేదు.ఆఫీసుకు వెళ్ళాలంటే రోజు ఏడుపే. తప్పదు. వేరే దారిలేదు. ఈ ఉద్యోగం కూడా చాలా కష్టించి సాధించుకున్నాను. ఈ ఉద్యోగం ఉందనే ఉద్దేశ్యంతోనే వెంకట నరసు(నా భార్య) కుటుంబం మంచి ‘ప్యాకేజీ’ ఇచ్చి నన్ను సెలెక్ట్‌ చేసుకుని అల్లుడు పోస్టింగ్‌ ఇచ్చింది.‘ఒరేయ్‌ జాగ్రత్త! సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చూడటానికి బాగున్నా ఊడడానికి చాలా ‘ఫాస్ట్‌. ఏదైనా తిరకాసు వచ్చిందంటే, ‘సాఫ్ట్‌’ అన్న వర్ణక్రమం మార్చుకుని ఉద్యోగం ‘ఫాస్ట్‌’గా ఊడుతుంది.

ఉద్యోగం లేని జీవితం వరస్ట్‌, బయట ఉద్యోగాలకి నువ్వు అన్ఫిట్‌. జాగ్రత్త..’ మా ఊరిలో నా చిన్ననాటి స్నేహితులు హెచ్చరికలు చేసి పంపారు,పల్లెటూర్లో ఉండే ఈ బడుద్ధాయిలకి ఈ విషయాలు ఎలా తెలిశాయా! అని ఆశ్చర్యపడుతూనే ఉద్యోగంలో చేరాను.అనిల్‌ సంతోషి నా బాస్‌. సంతోషి అంటే, ‘షి’ అనుకున్నాను. కాదు ‘హి’నే! చెరువు దగ్గర ఉండే దొంగ కొంగ ఈ సంతోషి. నేనో అమాయక చేప పిల్లల్లా కనబడి ఉంటాను. హిందీ సరిగారాని చేపపిల్లని.ఉద్యోగంలో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్నాను. కాలేజీ చదువు ఇక్కడ ఉపయోగపడదనే తత్త్వం నెమ్మదిగా బోధపడుతూ వచ్చింది. సంతోషి నన్ను ఎప్పుడూ మింగుతాడా అని భయపడి ఛస్తున్నాను. ఉద్యోగంపోతే మా మావగారు నరసింహావతారం ఎత్తడం, మా ఫ్రెండ్స్‌నన్నో జోకర్ని చెయ్యడం గ్యారెంటీ. అది తలుచుకున్నప్పుడల్లా, తుఫాన్లో అరటి ఆకులా విలవిల్లాడిపోతాను.