గోదావరీ తీరాన ప్రతిష్ఠాన రాజ్యానికి రాజు విక్రమార్కుడు. ఒకనాడతడి ఆస్థానానికి క్షాంతిశీలుడనే భిక్షువొకడు వచ్చి రాజుకి పండొకటి కానుకగా ఇచ్చాడు. రాజు ఆ పండుని పక్కనున్న ఓ కోతిపిల్లకి ఇచ్చాడు. కోతి పండు కొరికేసరికి అందులోంచి మేలిరత్నం ఒకటి బయటపడింది. రాజు ఆశ్చర్యపడి, ‘‘నానుండి నీకేం సాయం కావాలి?’’ అని భిక్షువునడిగాడు.

‘‘రాజా! నేను మంత్రసాధన చేస్తున్నాను. అది పరిపూర్ణం కావడానికి నీఅంత మహావీరుడి సాయం కావాలి. వచ్చే కృష్ణచతుర్దశినాటిరాత్రి ఈ ఊరి శ్మశానంలో ఉన్న మర్రిచెట్టు వద్దకు వస్తే ఆ సాయమేమిటో చెబుతాను’’ అన్నాడు భిక్షువు.రాజు సరేనని భిక్షువుని పంపేశాడు. తర్వాత అతడు కోరినట్లే కృష్ణచతుర్దశినాటిరాత్రి విక్రమార్కుడు నల్లటి బట్టలు ధరించి, కత్తి చేత ధరించి, శ్మశానానికి వెళ్లి అక్కడ మర్రిచెట్టుకింద ఉన్న భిక్షువు దగ్గరకు చేరుకున్నాడు. భిక్షువు అతడితో, ‘‘రాజా! దక్షిణంగా వెడితే అక్కడ ఒకే ఒక ఇరుగుడుచెట్టు కనిపిస్తుంది. దానిపై ఉరితీయబడిన పురుషుడి శవం కనిపిస్తుంది. నీవా శవాన్ని చెట్టునుంచి దించి ఇక్కడికి తీసుకురావాలి. పొరపాటున కూడా నోరు విప్పకూడదు సుమా’’ అన్నాడు.

రాజు సరేనని దక్షిణాభిముఖుడై వెళ్లి ఇరుగుడుచెట్టు వద్దకు చేరుకుని, చెట్టుకు వేలాడుతున్న శవాన్ని చూశాడు. చెట్టెక్కి, శవం మెడకున్న తాడును కత్తితో కోసేసరికి శవం కిందపడి, దెబ్బ తగిలినట్లుగా ఏడవసాగింది. తెల్లబోయిన రాజు చెట్టు దిగి వచ్చి, శవాన్ని తడిమి చూశాడు. వెంటనే శవం నవ్వసాగింది. దాంతో ఆ శవంలో బేతాళుడున్నట్లు అర్థమై, ‘‘ఎందుకు నవ్వుతావు?’’ అన్నాడు రాజు. అతడిలా నోరు విప్పి మాట్లాడగానే, అలా శవం చివాలున వెళ్లి మళ్లీ చెట్టున వేలాడసాగింది. మాట్లాడి తప్పు చేశానని గ్రహించిన రాజు, మళ్లీ చెట్టెక్కి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానంవైపు నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు ‘‘రాజా! పాపం చాలా బరువు మోస్తున్నావు. నీకు ఆ శ్రమ తెలియకుండా ఉండటానికి ఒక చిన్నకథ చెబుతాను, విను’’ అంటూ విక్రమార్కుడికి ఈ విధంగా కథ చెప్పడం ప్రారంభించాడు.