అప్పటికి పావుగంటైంది వాళ్ళిద్దరి మధ్యా అంతపెద్ద గొడవ జరిగి. మంచంమీద గోడవైపు తిరిగి పడుకున్న రఘురాం ఇంట్లో ఎక్కడా చడీచప్పుడూ వినిపించకపోవడంతో పావుగంటక్రితం బలవంతంగా మూసుకున్నకళ్ళు నెమ్మదిగా విప్పాడు. అంతకన్నా నెమ్మదిగా ఇటువైపు తిరిగాడు. బెడ్‌రూమ్‌లో ఎక్కడా రమ కనిపించలేదు. ఇందాక మెయిన్‌డోర్‌ తీసి మళ్ళీమూసిన శబ్దం వినిపించింది. అంటే ఇంట్లోంచి వెళ్ళిపోయిందా? నెమ్మదిగా మంచం దిగాడు. శబ్దం కాకుండా బెడ్‌రూమ్‌ తలుపుతీసి హాల్లోకి వచ్చాడు. మెయిన్‌డోర్‌ మూయగానే ఆటోమేటిక్‌గా లాక్‌ అయిపోతుంది. లాక్‌ చేసుకుని బైటికిపోయిందా? ఇంత రాత్రివేళ ఎంత ధైర్యం ఈ రమకి? అసలు ఆడదానికి ఉండే వినయం, ఒద్దిక ఏమైనా ఉంటేగా అనుకుంటూ మంచినీళ్ళు తాగడానికి వంటింటివైపు వెళ్ళాడు. అతనికి అక్కడే హాల్లో సోఫాలో పడుకుని నిద్రపోతున్న రమ కనిపించింది.ఇక్కడే ఉందా, వెళ్ళలేదా.. అంటే వాళ్ళక్క పోలిక రాలేదన్నమాట. తన బెదిరింపులు బాగానే పనిచేశాయి. అక్కావాళ్లు చెప్పింది నిజమే. కాస్త అలుసిస్తే ఈ పెళ్ళాలు నెత్తినెక్కి స్వారీ చేస్తారు. ఇప్పుడొచ్చి యేకుమేకై కూర్చుని ఎప్పట్నుంచో ఉన్న తల్లికీ, అక్కచెల్లెళ్లకూ మొగుణ్ణి దూరం చేస్తారు.

 అందుకే పెళ్లైన కొత్తల్లోనే వాళ్ళను ఎక్కడుంచాలో అక్కడుంచాలి. అందులోనూ ఈవిడ అక్కగారు అసలే మొగుణ్ణి వదిలేసి వచ్చిందాయే. ఈ రమ అలాకాకుండా ఉండాలంటే ఈ మాత్రం ముందు జాగ్రత్త ఉండాల్సిందే అనుకుంటూ ఫ్రిజ్‌ తీసి మంచినీళ్లు తాగి, మరోసారి హాల్లో సోఫాలో నిద్రపోతున్న రమని తృప్తిగా చూసుకుని వెళ్ళి పడుకున్నాడు రఘురాం.

అంతకి అరగంట క్రితమే రమకీ, రఘురాంకీ చిన్న వాగ్యుద్ధంలాంటిది వచ్చింది. ఇంకా వాళ్ళకి పెళ్ళై మూడు నెలలు కాలేదు. అప్పుడే వాళ్ళ మధ్య మాటామాటా పెరిగింది. నువ్వెంతంటే నువ్వెంతనే హద్దులు దాటేసి, మీవాళ్ళు ఇలాంటివాళ్ళు, మీ వాళ్ళిలాంటి వాళ్ళనే వరకూ సాగింది. ఆపైన అనకూడదనుకుంటూనే, ‘ఇంతేలే... మొగుణ్ణి వదిలేసివచ్చిన అక్క పోలిక రాకుండా ఉంటుందా?’’ అనేశాడు రఘురాం. ఆ మాట తగలరాని చోటే తగిలింది రమకి. దెబ్బతిన్న పులిలా లేచింది. ‘అమ్మ, అక్కలమాట వినేవాడివి, నువ్వూ ఓ మొగుడివేనా?’ అని ఆమె కూడా మాట విసిరేసింది.