‘కిరణ్‌ ఆస్పత్రి నుంచి తప్పించుకున్నాడు’.ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ ఫోనులో చెప్పాడు. డిటెక్టివ్‌ శరత్‌కి అర్థం కాలేదు.‘కిరణ్‌ ఎవరు?’ అడిగాడు.‘మరచిపోయావా? వాడు అమ్మాయిలను హింసించిన వీడియోపంపి, ఇంకో అమ్మాయిని కిడ్నాప్‌ చేస్తే చివరి క్షణంలో క్రితంవారం మనం పట్టుకున్నాం. దొరికిపోతానన్న భయంతో ఆత్మహత్య ప్రయత్నం చేశాడుగానీ చావలేదు’‘ఓ... గుర్తొచ్చింది. తప్పించుకున్నాడా?’‘ఔను. వాడు ఆస్పత్రిలో ఉన్నంతకాలం నీపై ప్రతీకారం తీర్చుకుంటానని, వదిలిపెట్టేదిలేదనీ, ఆస్పత్రినుంచి తప్పించుకుంటాననీ నర్సులతో సహా అందరితో చెప్పాడు.అన్నంతపనీ చేశాడు. వాడికోసం గాలిస్తున్నాం. నీ జాగ్రత్తలో నువ్వుండు’ చెప్పాడు విజయ్‌.‘రానీ.. మళ్ళీ జైలుకి వెళ్ళాలనుకుంటే నా దగ్గరకే వస్తాడు’ అన్నాడు శరత్‌.ఫోనుపెట్టి ఫైలు తెరుస్తుంటే టేబుల్‌పై నీడ పడింది. తల ఎత్తిచూశాడు శరత్‌.ఎదురుగా అసిస్టెంట్‌ రాము. అతడి ముఖంలో బాధ, కంగారు!‘ఏమైంది?’ అడిగాడు శరత్‌.

‘బాస్‌.. సెక్రటరీ సుధ ఫోను నెంబరు నుంచి ఫోను వచ్చింది. కిరణ్‌ ఆమెని కిడ్నాప్‌ చేశాడట. రక్షించుకుంటే రక్షించుకోండి అన్నాట్ట’.‘అదేమిటి? ఇందాకే విజయ్‌ ఫోను కనెక్షన్‌ ఇచ్చింది ఆమెకే కదా? ఆఫీసులోనే ఉంది కదా?’ ఆశ్చర్యంగా అడిగాడు శరత్‌.‘యెస్‌ బాస్‌... వాడు ఆఫీసులోకొచ్చి రిసెప్షన్‌ నుంచే ఆమెని కిడ్నాప్‌ చేశాడు. ఆ సమయంలో క్లయింట్లెవ్వరూ లేరు’ చెప్పాడు రాము.వెంటనే తన కంప్యూటర్‌ మానిటర్‌ ‘ఆన్‌’ చేసి సిసి టీవీ రికార్డింగ్‌ చూడటం ఆరంభించాడు.సుధ అప్పుడే వచ్చింది. ఆమె రాగానే విజయ్‌ ఫోను వచ్చింది. విజయ్‌ ఫోను కనెక్షన్‌ ఇచ్చింది. అంతలో కిరణ్‌ లోపలకు వచ్చాడు. క్లయింట్‌ అనుకుంది సుధ.ఏదో అనబోయింది. అతడు తుపాకీ తీశాడు. ఆమె బెదిరి డేంజర్‌ బటన్‌ నొక్కబోయింది.