ఒకానొకప్పుడు విదేహదేశంలో పాండురంగడనే మహావీరుడుండేవాడు. అతడు ఏ రాజు కొలువుకూ వెళ్లకుండా, ఇంట్లోనే ఉండి తన ప్రతిభకు మెరుగులు దిద్దుకునేవాడు. పాండురంగడు మహావీరుడన్న విషయం దూరప్రాంతాలకు పాకింది. అతడితో ద్వంద్వయుధ్ధం చెయ్యాలని, ఎందరో యోధులు ఎక్కడెక్కడినుంచో వచ్చేవారు. ఒక్కరూ అతణ్ణి గెలవలేకపోయారు. తన సైన్యంలో చేరమని ఆ దేశరాజు అతడికి ఆహ్వానం కూడా పంపాడు. కానీ పాండురంగడు వెళ్లలేదు.

పాండురంగడికి వారసత్వంగా సంక్రమించిన ఆస్తి ఉంది. అందువల్ల వేరేచోట కొలువుకు వెళ్లాల్సిన అవసరం అతడికి లేదు. కానీ అతడి భార్య సుగుణవతికి భర్త ఇంట్లోనే ఉండిపోవడం నచ్చలేదు. పెళ్ళైన కొత్తలో మొహమాటంకొద్దీ ఆ మాట చెప్పలేకపోయింది. తర్వాత అత్తమామలు కూడా అతణ్ణే సమర్థిస్తున్నారని గ్రహించి, ఎదురుచెప్పడం బాగుండదని ఊరుకుంది. పాండురంగడికి వివాహమైన నాలుగేళ్లకే అతడి తలిదండ్రులు కాలం చేశారు. వాళ్లు పోయిన దుఃఖంలో ఉన్నాడని కొన్నాళ్లు ఆమె అతడివద్ద ఈ ప్రసక్తి తేలేదు.అత్తమామలు చనిపోయి ఓ ఏడాది గడిచాక, ఒకరోజున ఆమె భర్తతో, ‘‘నాథా! మీరు మహావీరులు.

ద్వంద్వయుద్ధంలో తలపడినవారందర్నీ ఓడించారు. ఐతే మీ శక్తి మీ సంపాదనకు పనికిరావడం లేదు. మరి మీ భార్యనైన నాకు మీరు స్వయంగా సంపాదించినది అనుభవిస్తేనే తృప్తిగా ఉంటుంది. కానీ మీరిప్పుడు అనుభవిస్తున్న ఆస్తి మీ పెద్దలది’’ అంది.‘‘అంటే నేనేం చెయ్యాలంటావ్‌?’’ అన్నాడు పాండురంగడు విసుగ్గా. ‘‘డబ్బు సంపాదించడం ఇష్టం లేకపోతే, మీ శక్తితో నలుగురికీ పనికొచ్చేపని చెయ్యండి’’ అంది సుగుణవతి. పాండురంగడు నిర్లక్ష్యంగా నవ్వి ‘‘తలిదండ్రులు నాకు జన్మనిచ్చారు. అలాగే ఆస్తినీ ఇచ్చారు. అది నీకు అభ్యంతరమెందుకైంది?’’ అన్నాడు.