‘‘పెద్దాయన పోయాడట గదరా?’’‘‘అవునట, మహానుభావుడు వెళ్ళిపోయాడు’’‘‘వయసు 80 దాటిందంటావా?’’‘‘తొంభై దాటిందనుకుంటా, ఏమో?’’‘‘కానీ చివరిరోజుల్లో బాగా చిక్కిపోయి ఎముకలు బయటపడి బాబోయ్‌ చూడలేక పోయా, వయసు పోల్చలేకపోయా’’.

‘‘పాపం ఎట్టాంటి మహారాజు ఎట్టా అయిపోయాడ్రా? నువ్వు చెబుతుంటె ఎట్టాగో అనిపిస్తోంది.‘‘కాలం రా కాలం...దాని సంగతి అంతే, ఎంతటోడికైనా తప్పదు. వయసుకి లొంగాల్సిందే! మా తాత చెబుతా ఉండేవాడు ఆ రోజుల్లో ఆయన గుర్రంస్వారీ చేస్తావుంటె రెండుకళ్ళూ చాలేవుగావట!’’‘‘నేనూ విన్నాన్రా, ఆయన వ్యహారం మీద కూచుంటె మంత్రులు కూడా బలాదూరట. ఆయన తీర్పు చెబుతే జడ్జీ దొరలు కూడా ముక్కుమీద వేలేసుకునేవారట’’.‘‘ఎలాంటి తగూ అయినా సిటికెలో తీర్పు ఇచ్చేవారట. దానికి తిరుగుండేది కాదట. ఆయన జీపు దిగి వసారాలో కూర్చుంటె సభ తీరినట్లే ఉండేది. ఊరి పెద్దలంతా అక్కడ జేరాల్సిందే. అందుకే చుట్టుప్రక్కల పదిహేనూళ్ళకు ఆయనే పెద్దాయన. ఆ విగ్రహం, ఆ నిగ్రహం, ఆ మాట తీరు గొప్పగా ఉండేవి.

కానొరేయ్‌ ఒక్క విషయంలో మాత్రం కొంచెం మెతక!’’‘‘దేంట్లోరా, డబ్బు విషయమా? ఆస్తుల ఆశా? మరింకేదైనా?’’‘‘కళ్ళు పేలిపోతాయిరా చచ్చు వెధవ! లెంపలేసుకోరా పిచ్చోడా’’.‘‘అంతేనేరా?...అంతమాట అనేశావు?’’‘‘మరింకేంట్రా తిక్కసన్యాసి, ఏ విషయంలోనైనా వేలెట్టి చూపలేంరా అంత నిఖార్సైన మనిషి. మెతక అని ఎందుకన్నానంటె జాలిపడితే ఒక ఎకరం రాసిచ్చేవాడు. తనకు న్యాయమనిసిస్తే కౌలుకిచ్చిన ఎకరం కౌలుదారుకే స్వంతం చేసేవాడు.

ఓరి..ఓరి..శానా టైమైందిరా. పద.పద ఆరింటికాడికి...పోదాం పాలి!‘‘కడుపు నిండా కరువుదీరా పెట్టావుగా తిట్లు, ఇహ పద’’వారింటికి చేరేసరికి ఊళ్ళో జనం గుమికూడి ఉన్నారు. కాకపోతే ఎవ్వరూ పెద్దగా మాట్లాడటంలేదు. అక్కడక్కడ గొణుగుడుగా లోగొంతుల్తో మాటలు వినీవినబడనట్లున్నాయి. అందరి మొహాలు ఒకింత గంభీరంగా ఉన్నా పాత రోజుల్లోలా రోదనలు లేవు. మనిషి జీవన విధానంలో మార్పువచ్చినట్లుగానే ఇలాంటి సందర్భాలలో కూడా మార్పు స్పష్టంగా కనబడుతున్నది.