‘‘అమ్మా..... నాన్నా.....! త్వరగా రండి’’పెరట్లో నుండి మా బాబు ధీరజ్‌ పెద్దగా రంకెలు వేసినట్లు అరవటంతో ఏం జరిగిందోనని ‘‘ఏంట్రా చిన్నా.... ఏమైంది...?’’ అంటూ చేస్తున్న ‌షేవింగ్‌ని మధ్యలోనే ఆపేసి గబగబా పెరట్లోకి వెళ్ళాను.‘‘నాన్నా...! మామిడిచెట్టు.... మామిడిచెట్టు... ఏమైంది?’’ వేలితో మా పక్కింటి వైపు చూపిస్తూ కాస్త ఏడుపు గొంతుతో అడిగాడు.

అప్పుడే అటు చూసిన నేను కూడా ఆశ్చర్యపోయాను.మా పక్కింట్లో ఇంతెత్తున ఏపుగా పెరిగి, దాని కొమ్మలు గోడ మీదుగా మా పెరట్లోకి వచ్చిన మామిడిచెట్టు లేదిప్పుడు అక్కడ. రోజూ తెల్లవారుఝామున ఆ చెట్టుమీద ఉండే పక్షుల కిలకిలరావాలతో మాకు మెలుకువ వస్తుంది. ఈరోజు ఆ విషయమే గమనించలేదు నేను. మా పిల్లలు నిద్రలేవగానే టూత్‌బ్రష్‌లు తీసుకొని పెరట్లోకి వచ్చి ఆ చెట్టు మీదుండే కోయిలతో పోటీపడి వీళ్ళు కూడా కూ....కూ... అంటు అరిచేవాళ్ళు.మా పిల్లల అరుపులకి మరింతగా రెచ్చిపోయినట్లు అదేపనిగా పదేపదే అది కూస్తుంటే వీళ్ళు కూడా హుషారుగా దానికి వంతపాడే వాళ్ళు.‘‘కోయిలతో మీ సరాగాలు ఇక చాలుకాని రండి... స్కూలుకి టైమవుతుంది... స్నానం చేద్దురు....’’ అని వాళ్ళమ్మ పిలిచేవరకూ వచ్చే వాళ్ళుకాదు.

ఇక ఆదివారం వచ్చిందంటే మా పిల్లల టిఫిన్లు, భోజనాలు, ఆటపాటలు అన్నీ ఆ చెట్టు కిందే. ఇప్పటివరకు మావైపుకి వచ్చిన ఆ మామిడిచెట్టు కొమ్మకి కాసిన కాయలతో ఎన్నోసార్లు ఆవకాయ, మాగాయ, ముక్కల పచ్చడి, మామిడికాయ పప్పు... ఎన్నో చేసుకన్నాం.మా నిత్య జీవితంలో ఓ భాగమైపోయిన ఆ చెట్టులేకుండా ఆ మూలంతా బోసిగా ఉండేసరికి నాకే ఏదోలా అనిపించింది. కొమ్మ మీది నుండి కాయ రాలటంతోనే నేను... నేనంటు పరిగెత్తుకెళ్ళే మా పిల్లలకి అక్కడ చెట్టు కనపడకపోయేసరికి ఎంతగా ఫీలయి ఉంటారో చెప్ప లేను. ఆ చెట్టు తోటి, దానికి కాసేకాయలతోటి, దానిమీదుండే పక్షుల తోటి మా పిల్లలకున్న అనుబంధం ఈనాటిది కాదు. మా పిల్లలు పుట్టినప్పటి నుండి ఆ చెట్టునీడనే ఆడుకొంటూ, ఆ చెట్టుకాయలు తినే పెరిగారు.