అక్కడ..మైసూరుపాకులు గుల్లబారి ఉంటాయి. గుడి గోపురంలాగా పేర్చి ఉంటాయి. కోవా బిళ్ళలైతే వృత్త లేఖినితో కొలిచినంత కచ్చితంగా, విచ్చ రూపాయలు దొంతుపెట్టినంత ఒద్దిగ్గా, విచ్చుకున్న కలువల్లా ఠీవిగా ఉంటాయి. బంగారం పూసలతో కట్టిన బంతుల్లాంటి లడ్లు, అపరంజి తీగల్ని మెలితిప్పినట్లుండే జిలేబీలు- ఒకటేవిటి? అద్దాల తలుపుల వెనక తియ్యదనాల తినుబండారాలన్నీ కనులకు విందు చేస్తాయి. కడుపులు నింపేస్తాయి. అదీ పాపాయమ్మ చేతి మహాత్మ్యం!

దగ్గర దగ్గర అరవయ్యేళ్ళ క్రితం.. అప్పటికే ఆవిడ యాభైకి చేరువలో ఉన్నరోజుల్లో, పాపాయమ్మ మొహం బొల్లి మచ్చలతో బూడిద పూసినట్లుండేది. మోచేతుల మీదా, పాదాల మీదా అతికించిన ప్లాస్టర్ ముక్కల్లా చారలు కనిపించేవి. బెలగాం అగ్రహారం వీధిలో వాళ్ళంతా ఆవిణ్ని బొల్లి పాపాయమ్మ అనేవారు. అప్పట్లో ఆవిడ మిఠాయిల స్పెషలిస్ట్‌గా పేరుమోసింది. బెలగాం సెంటర్‌కి దగ్గరగా, పడమటివైపు అగ్రహారం వీధిలోని శ్రీనివాసరావు హొటేలులో పాపాయమ్మ స్వీట్లు చేసేది. ఎవరైనా పనివాళ్ళు రాకపోతే ఉల్లిపాయలు, బంగాళా దుంపలూ తరిగేది. హొటేలు వెనకాల సామాన్ల గదిలో పాపాయమ్మ తలదాచుకునేది. పాపాయమ్మకి పిల్లల్లేరు. భర్త చిన్నప్పుడే పోయాడు.

అత్తవారింటి నుంచి ఏటా పంటల నూర్పిడి తర్వాత భరణం కింద కొంత మొత్తం మనియార్దర్ వచ్చేది.బెలగాంలోని ముఖ్యమైన వీధుల్లో లాయర్లూ, డాక్టర్లూ, టీచర్ల ఇళ్ళలో తీపి దినుసులు వండాల్సి వచ్చినప్పుడు పాపాయమ్మనే పిలిచేవారు. అలాగే వేసవిలో బెల్లపు ఆవకాయ, కారపు ఆవకాయ, మాగాయ, తొక్కు పచ్చడి, శీతకాలంలో టమాటా పచ్చడి, వడియాలు లాంటివి పెట్టాలంటే బొల్లి పాపాయమ్మని పిలవాల్సిందే. ఆవిడ ఒత్తిందంటే అప్పడాలు చంద్రబింబాలే! కందిగుండ విసిరి ఇంగువ కలిపిందంటే ఆ రుచే వేరు! ఇలాంటి పనులేవీ లేనప్పుడు కూడా పాపాయమ్మ ఖాళీగా ఉండేది కాదు.

హొటేలులో స్వీట్ల వంట పూర్తి కాగానే మధ్యాహ్నం వేళ ఏ ఇంటి నుంచో పిలుపు వచ్చేది. కొత్తచింతపండు పిక్కలు తియ్యడం, అడ్డాకుల విస్తళ్ళు కుట్టడం లాంటి పనులు పాపాయమ్మకి ఉండనే ఉండేవి. వీటన్నిటికీ పాపాయమ్మ పారితోషికాలు అడిగిమరీ పుచ్చుకునేది. అలాగని ఆవిడ కేవలం డబ్బు మనిషి కాదు. కొన్ని సందర్భాల్లో ఏగాణీ కూడా ఆశించేది కాదు. పుట్రేవు డాక్టరుగారింట్లో కార్తీక పురాణంవింటూ వత్తులు చేయడం, ఎవరైనా తేలుకుట్టిందని వస్తే మంత్రం వేయడం, పొరుగున చర్చి వీధిలోని స్త్రీ భక్త సమాజంలో దేవీనవరాత్రులకి మడిగా వంటలు చేయడంలాంటివి పాపాయమ్మ సేవాభావంతో చేసిపెట్టేది..