అర్ధరాత్రి సమయం....అందరూ నిద్రాదేవి ఒడిలో వెచ్చగా నిద్రపోతున్న వేళ....వీధిలోని దీపాలన్నీ కునికిపాట్లు పడుతున్న వేళ...వీధి మూలలో కూర్చున్న కుక్క అప్పుడప్పుడు ఆకాశం వైపు ముఖమెత్తి ఏడుస్తున్న వేళ....సరిగ్గా అదే సమయంలో....అక్కడి నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ పోలీస్‌ జీపు సైరన్‌ మోతతో దూసుకొచ్చి ఓ బంగ్లాముందు ఆగింది.జీపులోంచి ‘వివేక్‌ వుహార్‌’ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌.ఐ. నిరంజన్‌ త్యాగి చప్పున దిగాడు.ఆయన వెనకనే మిగతా సిబ్బంది కూడా హడావుడిగా దిగింది.వారంతా బంగ్లా పక్క సందులో పడి ఉన్న ఓ మూటను సమీపించారు.దూరం నుంచి పరుపును చుట్టినట్టు కనిపిస్తున్న ఆ మూటలో ఓ వ్యక్తి మృతదేహం ఉంది.

ఎస్‌.ఐ. నిరంజన్‌ త్యాగి జీపు హెడ్‌లైట్ల కాంతిలో శవాన్ని పరిశీలించాడు. మృతుడు వయస్సులో ఉన్న యువకుడు. అతని శరీరంతో బాటు ముఖం కూడా కొంతభాగం కాలిపోయింది. కాళ్ళు చేతులు రాగి తీగలతో బంధించబడి ఉన్నాయి. పదునైన కత్తితో కోసిన కారణంగా తల మొండెం నుంచి వేళ్ళాడు తోంది. అయితే శవం దరిదాపుల్లో ఎక్కడా రక్తపు మరకలు కనిపించలేదు.ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంది.పోలీస్‌జీపు సైరన్‌ మోతకు చుట్టుపక్కల ఇళ్ళల్లోని వ్యక్తులు మేల్కొన్నారనటానికి గుర్తుగా వాళ్ళ ఇళ్ళల్లో లైట్లు వెలిగినా ఎవరూ తలుపులు తెరుచుకుని బయటికి వచ్చే ప్రయత్నం చేయలేదు.ఓ అజ్ఞాతవ్యక్తి ఫోన్‌కాల్‌ ఆధారంగా ఎస్‌.ఐ. నిరంజన్‌ తాగి తన బలగంతో అక్కడికి చేరుకున్నాడు.

పోలీసుల కొద్దిపాటి ప్రయత్నం వల్ల కొంతమంది విధి జనాలు బయటికివచ్చారు. అయితే శవాన్ని గుర్తించలేకపోయారు. ఆ కారణంగా మృతుడు ఆ ప్రాంతానికి చెందినవాడు కాకపోవచ్చని ఎస్‌.ఐ. నిరంజన్‌ త్యాగి నిర్ణయానికి వచ్చాడు. మృతుడి దుస్తుల్లోనూ ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడు ధరించిన ఖాకీ రంగు దుస్తులు చాలావరకు కాలిపోయి ఉన్నాయి.శవాన్ని వివిధ కోణాల్లో ఫొటోలు తీయించాక, శవపంచనామా జరిపించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీస్‌స్టేషన్‌కు తిరిగి వచ్చిన ఎస్‌.ఐ. నిరంజన్‌ త్యాగి తన సిబ్బందికి కొన్ని సూచనలు ఇచ్చాడు.‘‘శవం చుట్టు పక్కల ఎక్కడా కూడా రక్తపు మరకలు లేవు. కాబట్టి మృతుడు ఈ ప్రాంతానికి చెందిన వాడు కాదని తెలుస్తుంది.

అయితే హంతకుడో హంతకురాలో ఓ చిన్న పొరబాటు చేశారు. మనం పరిశోధనను ముందు కొనసాగించటానికి ఓ చిన్నఆధారం వదిలాడు. మృతశరీరం రాగి తీగలతో బంధించబడి ఉంది. బహుశా హత్య జరిగిన ప్రాంతంలో ఏదైనా తీగల ఫ్యాక్టరీ ఉండొచ్చు. హత్య అక్కడే జరిగి ఉండొచ్చు. పైగా శవాన్ని కాల్చే ప్రయత్నం జరిగింది. అంటే హతుడిని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండాలని హంతకుడు ఈ పనిచేసి ఉండాలి. అంటే హతుడు, హంతకుడు ఈ ప్రాంతానికే చెంది ఉండొచ్చు. మన పరిశోధన ముందుకు సాగటానికి ఘటనా స్థలానికి దగ్గర్లో ఏదైనా రాగి తీగల ఫ్యాక్టరీ ఉందేమో కనుక్కోవాలి’’ అంటూ ఆ పని మీద తన సిబ్బందిని పంపాడు ఎస్‌.ఐ. నిరంజన్‌ త్యాగి.