అమెరికా అక్క వస్తోందని తెలిసి ఖర్చులభయం పట్టుకుందాతమ్ముడికి. అక్క రానేవచ్చింది. చిరుకానుకలు తప్ప తెచ్చిందేంలేదు. హూ! అంత డబ్బుంది ఎందుకు? దేనికైనా మనసుండొద్దూ అని అసంతృప్తికి గురయ్యాడు తమ్ముడు. తల్లిదండ్రులులేని లోటు తీర్చి వదినగార్ని ఘనంగా సాగనంపిందా ఇల్లాలు. చివరికి ఆ తమ్ముడు అప్పులపాలయ్యాడా? అక్క చేసిందేమిటి?

 

‘‘మీనా! మా రాధక్కయ్య అమెరికా నుంచి వచ్చిందట. హైదరాబాద్‌లో అన్నయ్య వాళ్ళింట్లో దిగిందని తెల్సింది. సర్‌ఫ్రైజ్‌ చేద్దామని ముందుగా ఫోన్‌ కూడా చెయ్యకుండా వచ్చిందట. మనింటికీ ఏ క్షణాన్నయినా రావచ్చు మరి’’ టీవీ చూడ్డంలో నిమగ్నమైన భార్యతో అప్పుడే గుర్తొచ్చినట్టు చెప్పాడు గోపాల్‌.‘‘అవునా! ఇది నిజంగా హ్యాపీన్యూస్‌! కదండీ?‌!’’ మొహంనిండా ఆనందం పులుముకుని అంటున్న భార్యను చూసి, ‘‘ఇదో పిచ్చిమొద్దు. ఇంటికి ఏ చుట్టాలొచ్చినా ఎగిరిగంతేసే రకం. ఇక మా రాధక్కయ్య అయితే ఇంక దాన్ని పట్టలేం..’’మనసులోనే అనుకుని, ‘‘అవుననుకో!... కానీ ఒక్క విషయం మీనా... మన ఆర్థికపరిస్థితి తెలియక ఆవిడ ‘‘మీనా! నువ్వు చేసే కారప్పూస నోట్లో వేసుకుంటే కరిగిపోతుందే’’ అనో ‘‘నువ్వు చేసే కాకినాడ ఖాజాల రుచి కాకినాడవాళ్ళు చేసినా రాదు’’ అనో ఉబ్బేస్తే, ఆ పొగడ్తలకు కరిగిపోయి పొంగిపోయి, ‘‘ఓ... దానికేం భాగ్యం వదినెగారూ..’’ అని ఎగిరి గంతేసి ఒళ్ళుహూనం చేసుకుంటూ తయారుచెయ్యడం కాదు.

కాస్త బుర్ర ఉపయోగించు. నీతో ఇదే చిక్కు మీనా.. నీకెలా చెప్పాలో అర్థంగాదు. నా ఉద్దేశ్యం ఏంటంటే.. కాస్త.. నువ్వు మన ఇంటి పరిస్థితి గమనించి కొన్ని వినీ విననట్టుండు. అప్పులుచేసి కొప్పులు పెట్టడం.. అప్పులోళ్ళతో మాటలుపడటం నావల్ల కాదు మీనా.. వింటున్నావా?’’ రిమోట్‌తో చానల్స్‌ మారుస్తూ తదేకంగా టీవీ చూడ్డంలో మునిగిపోయిన భార్య, అసలు తన మాటలు వింటుందా అని సందేహమేసిందతనికి. గోపాల్‌ తనన్న మాటలు మళ్ళీ రెట్టించేసరికి, తన చురుకైన కళ్ళతో తీక్షణంగా చూసిందతనివైపు మీనా.

ఒక్కమాట చెప్పండి. అసలు ఆ వచ్చే ఆవిడ ఎవరు? స్వయానా మీ అక్కయ్య. మనకంటే పెద్దావిడ. విదేశాల్లో ఉండి ఎప్పుడో ఎన్నో ఏళ్ళకి ఒక్కసారి వచ్చే ఆవిడను నొప్పిస్తామా చెప్పండి. అయినా ఏ బంధువులైనా వారికి లేక మనింటికిరారు గదా! ప్రేమతో కలిసి ఉందామనేగదా వచ్చేది. అందునా తోడబుట్టిన వాళ్ళయితే కష్టం సుఖం చెప్పుకుని పుట్టింట్లో సేద దీరుదామనే వస్తారు. అయినా ఆవిడుండేది నాల్రోజులు. మహా అయితే ఓ వారం లేదా పది రోజులు. ఆ సమయంలో మన ఇబ్బందుల్ని ఆవిడకు తెలియనీయకుండా ఉంచడం మన విచక్షణపైన ఆధారపడి ఉంది. ఆ తరువాత మీ ఇష్టం’’ మీనా కాస్త ఘాటుగానే బదులిచ్చింది. ‘‘బాప్‌రే! ఈ మీనా ఎప్పుడూ ఇంతే! నాకు క్లాస్‌ తీసుకోవడమేగానీ నా అంతరంగం అర్థం చేసుకుందెప్పుడుగనుక...’’ తనలో తనే గొణుక్కున్నాడు గోపాల్‌.