నరేంద్రపుర మహారాజు నరేంద్రుడు అర్ధాంతరంగా కన్నుమూశాడు. అప్పటికి ఆయన కుమారుడు వీరేంద్రుడి వయసు పద్దెనిమిదేళ్లు. తండ్రి పోవడంతో చిన్నవయసులోనే అతడు పరిపాలనా భారం స్వీకరించక తప్పలేదు. అతడు సమర్థుడు కావడంతో - మంత్రులసలహాలతో చక్కగా రాజ్యపాలన కొనసాగిస్తూ రెండేళ్లలోనే తండ్రినిమించిన కొడుకు అనిపించుకున్నాడు.

వీరేంద్రుణ్ణి పెళ్ళాడాలని ఎందరో రాజకన్యలు ఉవ్విళ్లూరుతున్నారు. తల్లి కూడా అతణ్ణి త్వరగా వివాహం చేసుకోమని బలవంతపెడుతోంది. కానీ రాజ్యపాలనావ్యవహారాలన్నీ పూర్తిగా చక్కబడేదాకా పెళ్ళి చేసుకోనని అతడు తల్లికి ఖచ్చితంగా చెప్పేశాడు.అలా మరో ఏడాది గడిచింది. ఒకరోజున మహారాణి అతణ్ణి పిలిచి, ‘‘వీరేంద్రా! ఈ ఏడాదిలోనూ మనరాజ్యంలో చక్కదిద్దవలసిన వ్యవహారాలేమీ కనబడలేదు. అంటే నీవు సమర్థుడివయ్యావు. సమర్థుడైన రాజుకి తోడుగా రాణి ఉండాలి. కాబట్టి పెళ్ళి విషయంలో ఇక ఉపేక్ష కూడదు. పక్కగదిలో వివిధదేశాల రాకుమార్తెల చిత్రపటాలున్నాయి. వాటిలో నీకు నచ్చిన చిత్రపటాన్ని ఎన్నుకో. ఆ రాజకన్యతో నీకు పెళ్ళి జరిపిస్తాను’’ అని చెప్పింది.

వీరేంద్రుడు ఆమె చూపించిన గదిలోనికి వెళ్లాడు. అక్కడ అరబ్బుదేశాలనుంచి రప్పించిన తివాచీలు నేలమీద పరచి ఉన్నాయి. గోడలకానించి కళాత్మకంగా నగీషీలు చెక్కిన కాశ్మీరీ బల్లలున్నాయి. ఆ బల్లలమీద చిత్రపటాలు అందంగా సద్ది ఉన్నాయి. సౌందర్యంలో ఆ రాజకన్యలు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. వారి అందంముందు అరబ్బు తివాచీలు, కాశ్మీరీ బల్లలు వెలవెలబోతున్నాయి. వీరేంద్రుడు వాటినన్నింటినీ పరిశీలనగాచూసి గదిలోంచి బయటకొచ్చాడు. అతడి రాకకోసమే ఎదురుచూస్తున్న మహారాణి, ‘‘నాయనా! ఆ రాజకన్యలలో నీకు ఎవరు నచ్చారో చెప్పు’’ అంది ఆత్రుతగా.

వీరేంద్రుడు తల పంకించి, ‘‘విశాలదేశపు యువరాణి విశ్వమోహిని, కామరూప దేశపు రాకుమారి స్వరూపరాణి - వీరిద్దరి చిత్రపటాలు కూడా అక్కడుంటే బాగుండేది’’ అన్నాడు. ఆ చిత్రపటాలు కూడా అక్కడుండేవే కానీ ఆ ఇద్దరు రాజకన్యలూ తమ పెళ్ళిళ్ళకి షరతులు విధించారు. అందుకని మహారాణికోపంగా, ‘‘నిన్ను పెళ్ళాడాలని ఉవ్విళ్లూరుతున్నవాళ్లను వదిలి, తమను పెళ్ళాడేందుకు షరతులుపెట్టిన ఆ గర్విష్టి రాజకన్యలగురించి తాపత్రయ పడతావేం?’’ అంది. బదులుగా, ‘‘అమ్మా! నువ్వు అనుమతిస్తే వాళ్లిద్దరిలో ఒకరిని మాత్రమే వివాహం చేసుకుంటాను. లేదా నా వివాహం గురించి మరచిపో’’ అన్నాడు వీరేంద్రుడు.