వాళ్ళిద్దరూ రక్త సంబంధీకులే . కానీ దారులు వేరు. ఆలోచనలు వేరు. అందుకే వేరు పడ్డారు. అజాతశత్రువుల్లా ఉండాల్సిన వారిపిల్లలుకూడా అగర్భశత్రువులయ్యారు. తాతలనాటి ఆస్తి స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు అన్నయ్య. అందుకోసం పెద్ద ప్రణాళికవేశాడు. ఊరుజనాన్ని మభ్యపెట్టాడు. ప్రలోభపెట్టాడు. కానీ ఆ ఊళ్ళో జనం ఎలా స్పందించారు? ఆ అన్నదమ్ముల రక్తబంధం వారిని ఏకం చేయగలిగిందా?

అవే పదాలకూర్పులు, అవే వాక్యప్రయోగాలు పేర్చుకున్న అంబులపొదిలోని అక్షర అ‍‍స్త్రాలు. మనుషులను ఆకట్టుకునే మాటల మూటలు! అయినా తయారైన ఉపన్యాసం లోకనాథానికి తృప్తినివ్వడంలేదు.‘‘మన ఉపన్యాసం వినేవారినాడిని మనం పట్టుకోగలగాలి, అంటే ఈ ఉపన్యాసానికి తగినంత ఉప్పు పడాలి. చప్పగా ఉంటే వినేవాడు ఒక్కడుకూడా ఉండడు. ఏమంటావ్‌ గిరీ!’’ అంటూ భుజాలెగరేస్తూ నవ్వాడు లోకనాథం.‘చూచివ్రాత నయం. దీనికన్నా టైపుచేసి చేసి వేళ్లు కొంకర్లుపోతున్నాయి. అయినా ఈ అయ్యగారికి తృప్తిలేదు. ఇంటితగవును వీధికిలాగి పరువుకు నీళ్ళొలేశాడు. ఉపన్యాసంలో ఆయనకు కావలసినది ఉప్పుకాదు మసాలా!’ మనసులోనే విసుగు దాచుకున్నాడు గిరి.‘‘సరే సార్‌, ఉప్పెందుకు చక్కెరే కలుపుతాను చూడండి’’ అని వినయంగా తలవంచి నమస్క రించి వెళ్ళిపోయాడు.

‘‘ఆఁ మరిచాను, కాగితాలన్నీ శుభ్రమైన సంచిలో సర్దు. తెల్లవారడం ఆలస్యం మనం బయలు దేరాలి. మనసభ మనమే పెట్టుకుంటున్నాం కాబట్టి ఆలస్యం చేసామంటే అలసత్వానికి గురయినట్లే!’’చేదుగుళికల్లాంటి మాటలకు చక్కెరపూత పూసి ఆచరణలోకి వచ్చాకగాని, చేదునోటికి తగలనంత తియ్యగా తయారైన ఉపన్యాసాన్ని మనసారా మననం చేసుకుని తృప్తిగా గిరి భుజంపై చరచి, ‘‘ఇక చూడు మనమే విజేతలం’’ అని గర్వంగా చెప్పాడు.చిన్నతగువే. చిలికిచిలికి గాలివానైంది. పంతంపడితే వదిలేరకం కాదు లోకనాథం. అయితే న్యాయానికి అన్యాయం ఎదురైతే సహించనివాడు రాజయ్యపంతులు. రెండుగ్రామాలలో విస్తరించిన తాతలనాటి పొలాలను సమష్టిగా అనుభవించారు లోకనాథం, కిషోర్‌. విడిపోదామనే పిల్లలఆకాంక్షలకు పెద్దలు తలూపారు. అన్నదమ్ములపిల్లలే. అజాతశత్రువులు కావలసినది ఆగర్భశత్రువులైనారు. వరుసకు తమ్ముడైన కిషోర్‌ సర్దిచెప్పాలనుకున్నా, లోకనాథం అసలు వినిపించుకోడు.

ఒకేచోట ఉండి కలహాలకాపురం చేసేకన్నా దూరంగా ఉండి ఎవరి బ్రతుకువారు హుందాగా గడపవచ్చు అనుకుని తను నడయాడిన నేలనువదలి వెళ్ళిపోయాడు కిషోర్‌. లోకనాథం పట్నంలో వ్యాపారం మొదలుపెట్టి రాజకీయప్రవేశానికి పావులు కదుపుతూ అవకాశానికై ఎదురుచూస్తున్నాడు. లోకనాథానికి ఇక అడ్డేముంది అనుకోవడానికి వీల్లేదు. కిషోర్‌ తనకు అమ్మేసిన పొలాన్ని ఎట్టిపరిస్థితులలో వేరెవరికీ అమ్మనంటాడు ఆ పొలం కొనుక్కున్నరాజయ్య. ఎవరోఒకరు మనసును సరిపుచ్చుకుంటే సమస్య దూదిపింజే. కానీ, ఒకరిది అతిశయం. హక్కులేకపోయినా, మా తాతలఆస్తులు కదా అనే పిడివాదం. మరొకరిది కిషోర్‌పై ప్రేమ, అభిమానం. ‘ఇంత పంచాయతీ, ఇన్ని ఉపన్యాసాలు అవసరమా? రాజయ్యమీద ఒత్తిడితెచ్చేలా పల్లెజనాన్ని రెచ్చగొడ్తే మీరు బాగానే ఉంటారు, ఇరుగుపొరుగు గ్రామాలప్రజలు తలలు బద్దలుకొట్టుకుంటారు, మానవత్వంలేని మేధకన్నా, మేధలేని మానవత్వంమిన్న’ అనిచెప్పిన భార్యమాటలు లోకనాథానికి అసలు రుచించవు. కరుకుచూపులతో ఆమెమాటలకు మేకులుకొడ్తాడు.