కరుణ ఇంకా నిద్ర లేవలేదు.సమయం పది కావస్తున్నది. బాగా ఎండ వచ్చేసింది. ఇప్పటికే రెండుసార్లు లేపింది చైత్ర.‘‘అబ్బ ఆదివారమే కదా! కాసేపు పడుకోనీ’’ విసుక్కున్నాడు కరుణ.‘‘ఆదివారమే కాదనను. ఈరోజైనా కాస్త ఎక్కడికైనా వెళ్ళడం, బయట తినేసిరావడం అంటూ ఉంటే బాగుంటుంది. రోజూ ఉండే రొటీన్‌ టైంటేబుల్‌ ఉండదు’’ చైత్ర కాస్త అరిచినట్లుగానే చెప్పింది.కరుణ ఉలకలేదు, పలకలేదు. ముసుగుతన్నిమరీ పడుకున్నాడు.

‘‘అయినా ఈమధ్య కరుణ బయటకు తీసికెళ్ళడానికి ఎక్కువ ఇంట్రస్టు చూపడంలేదు. ఏదో ఒకపని ఉందని ఒక్కడే బయటకు వెళ్ళిపోతున్నాడు. గట్టిగా అడిగితే మాట మాట పెరిగి ఇద్దరిమధ్య దూరం పెరిగిపోతున్నది’’ ఆలోచనలతోనే కాఫీ కలుపుకుని ఒక్కత్తే కూర్చుని తాగింది.టీవీ ఆన్‌చేస్తే ఎప్పటిదో పాత సినిమా వస్తోంది. అన్యోన్యమైన దాంపత్యం, ముత్యాల్లాంటి పిల్లలు, కమ్మనిపాటలు. ‘‘ష్చ్‌! అనుకుంటూ ఛానల్‌ మార్చేసింది. సిల్‌సిలా! పాతసినిమా. చైత్రకి ఆ సినిమా అంటే చాలాఇష్టం. అమితాబచ్చన్‌ రేఖని ఎంతగా ప్రేమించినా చివరకు వివాహబంధానికి కట్టుబడి జయతోనే కాపురం చేస్తాడు. ఎందుకోగానీ రేఖ పాత్రకు న్యాయం కలగలేదని చైత్రకు అనిపిస్తుంది.పెళ్ళికి ఉన్న ప్రాధాన్యత ప్రేమకు ఇవ్వడం ఈ సినిమావాళ్ళకు కూడా ఇష్టం ఉండదేమో? ఆ పాత్రని చంపేయడమో, వదిలేయడమో చేస్తారు.

ఎప్పుడూ ఇద్దరుపెళ్ళాలు, లేకుంటే ఇల్లాలు–ప్రియురాలు సినిమాలేతప్ప ఇద్దరుమొగుళ్ళు, మొగుడు–ప్రియుడు అంటూ సినిమాలు తీసే గట్స్‌ వీళ్ళకు ఉండవా? లేకుంటే పురుషాధిక్యసమాజం కదా! అట్లానే తీస్తారా?’’ఈ ఆలోచనలలో మునిగిపోయింది చైత్ర. రాత్రి తాగిన హ్యాంగోవర్‌ తగ్గినట్లుంది. బ్రష్‌ చేసుకుని వచ్చాడు కరుణాకర్‌. కాఫీ ఇవ్వు అని అడిగాడు చైత్రని. ‘‘ఇప్పుడు నీకోసం మళ్ళీ పెట్టలేను. చూసిచూసి ఇప్పుడే తాగాను అయినా ఈమధ్య నీకు డ్రింక్‌ చెయ్యడం ఎక్కువైంది కరుణా!’’ అంది కోపంగా చైత్ర.