రాత్రి పదైంది. రెండురోజులనుంచీ కురుస్తున్న కుండపోతవర్షం కాస్త నెమ్మదించింది. తుంపర పడుతోంది. వర్షం, చలి, గాలి జతకలిసి ఈదురుగాలిలా మారి హోరుగాలి వీస్తోంది. చలిగాలికి తట్టుకోలేక ఇంటి తలుపులన్నీ మూసేశాం. దానికితోడు కరెంటు కూడా పోయింది.

నేనసలే గాలి జీవిని. ఫ్యాన్‌ లేనిదే క్షణం ఉండలేను. అందుకే చితచితకి చిరాకుపుడుతోంది. రెండురోజులనుంచీ వరుణుడిధాటికి భయపడి మబ్బుల మాటున ఉంటున్న భానుడు భూమ్మీదికి పంపుతున్న మసకవెలుగులోనే పగలంతా కూచుని ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్‌వర్క్‌ మూడొంతులు పూర్తిచేశాను. ఇంకో రెండుగంటలు రాసేస్తే రేపు కాలేజీలో సబ్మిట్‌ చెయ్యొచ్చు.కరెంటుకోసం చూస్తూకూచుంటే, కాలం మరోముప్ఫైనిమిషాల్ని ముందుకులాక్కెళ్ళిపోయింది. ఇంట్లో ఉక్కపోత భరించలేక కిటికీ తలుపులు తెరిచాను. రివ్వున లోపలికొచ్చిన చల్లగాలికి నా అసహనం హాయిగా ఊపిరి పీల్చుకుంది. పడుకుందామంటే నిద్రపట్టటం లేదు. కిటికీదగ్గరే కూచున్నాను. సన్నగా పడుతున్న వర్షపు తుంపర, గాలితో జతకలిసి లోపలికొచ్చి పడుతోంది.

సరిగ్గా ఆ సమయంలో ఎదురింట్లోంచి ఏడుస్తున్న స్త్రీ గొంతు వినిపించింది. అటువైపు చూశాను. వాళ్ళింటి ముందుగదిలో మసగ్గా లైటు వెలుగుతోంది. ఆమె గొంతులో ఏడుపు ఆగిపోయింది. అతని గొంతు ఉచ్ఛస్థాయిలో హిందీలో ఏదో అంటోంది. ఆమె ఎదురు చెబుతోంది. సంభాషణనుబట్టి వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నట్టు అర్థమౌతూనే ఉంది. అతని గొంతులో కోపం...జీరవోయిన ఆమె గొంతులో దుఃఖం.‘‘పెయింటింగ్స్‌ అమ్మేశావా?’’ అతని స్వరంలో రౌద్రం.‘‘మంచి ఆఫర్‌ వచ్చింది. అమ్మేశాను, నువ్వుంటే ఎలాగూ అమ్మనివ్వవుగా!’’‘‘నా పెయింటింగ్స్‌ నా పర్మిషన్‌ లేకుండా అమ్మే అధికారం నీకెక్కడిది?’’‘‘..... .........’’ అతను ఆమె మీద చెయ్యి చేసుకున్న శబ్దం.