ఊరు నిదరోతోంది. ఆ నిశీథిని పార భుజానేసుకుని బయలుదేరాడు. అతడి గమ్యం శ్మశానం! ఎక్కడో కీచురాయి రొద. చీకట్లో అస్పష్టంగా కనిపిస్తున్న గోరీలమధ్య నడుస్తూ ఒకచోట ఆగి సమాధిని తవ్వడం ప్రారంభించాడు. కాసేపటికి పారకు శవపేటిక తగిలిన చప్పుడు వినిపించింది. శవపేటికమీద మట్టి తొలగించి మూతకున్న మేకుల్ని పారతో పెకిలించే ప్రయత్నం చేశాడతను. అంతలో ఊహించని సంఘటన...!

శీతాకాలంఅర్ధరాత్రి సమయంవిపరీతంగా మంచు కురుస్తోంది.డిసెంబర్‌నెల చలి తీవ్రంగా వణికిస్తోంది.అయిలయ్య తన పూరిపాక తడికె తెరచి బయటకు చూశాడు. వీధి నిర్మానుష్యంగా ఉంది. దూరంగా ఎక్కడో కుక్క ఒకటి చలికికాబోలు ఏడుస్తున్నట్లు అరుస్తోంది. తడికె దగ్గరగా చేరవేసి, లోపలకొచ్చి ముడుచుకుని పడుకున్నాడు అయిలయ్య. తడికెలోంచి పాకలోనికి చొరబడుతున్న చలిగాలి సూదుల్లాగుచ్చుతూ శరీరాన్ని బాధిస్తోంది. ఎముకలు కొరికేసేలాంటి చలి గుండెల్ని వణకిస్తోంది.తట్టుకోలేక పోతున్నాడు అయిలయ్య. వజవజా వణుకుతున్నాడు. గజగలాడుతున్నాడు.కంటిమీద కునుకు రావటంలేదు. ఒకవేళ ఏ గంటకో, గడియకో, మూగన్నుగా నిద్రపడితే చాలు, చెవిలో జోరీగలా భార్య సణుగుడు వినిపిస్తూనే ఉంది.గుడిసె బయట ఎలాఉందో, లోపలకూడా చలి అలాగే ఉంది.

ఇక పడుకోవటం అసాధ్యం అనిపించింది. లేచి చిరిగిన తుండుగుడ్డ దులిపి, చెవులకు చుట్టుకున్నాడు. భార్య మాటలు చెవుల్లో పదేపదే వినవస్తూనే ఉన్నాయి.మూలనున్న పార తీసుకుని, భుజానికేసికుని పాకలోంచి బయటకు నడిచాడు. పంచాయతీ వీధిలైటు మిణుకుమిణుకుమంటూ వెలుగుతోంది. ఆ వెలుతురులో మెల్లగా నడవసాగాడు. చలిగాలి మొహానికి కొడుతోంది. తమాయించుకుని ముందుకుసాగుతున్నాడు. కొంతదూరం నడిచాక, అతడు చేరవలసిన గమ్యం రానే వచ్చింది.ఊరికి ఉత్తరాన ఉన్న శ్మశానం అది. కొద్ది క్షణాలు సంశయిస్తూ అక్కడే నిలబడిపోయాడు అయిలయ్య.

ఎక్కడో కీచురాయి ఒకటి అదేపనిగా రొదపెడుతూనే ఉంది. చీకట్లో అస్పష్టంగా తెల్లగా అగుపిస్తున్నాయి గోరీలు. గుండె దిటవు చేసుకుని ముందుకు కదిలాడు. సమాధుల మధ్యనుండి నడుస్తూఉంటే కాళ్ల క్రింద ఎండుటాకులు, కర్రపుల్లలు, నలుగుతూ చిన్నగా శబ్దం చేయసాగాయి. అతడు ఓ సమాధి దగ్గర ఆగాడు. తనని ఎవరైనా గమనిస్తున్నారేమోనని పరిసరాలు పరికించాడు. ఆ నిర్జన నిశీధిలో ఎవరూ అగుపించలేదు.