రాత్రి కురిసిన వానకు రాలిన చినుకులు తంగేడు పూలపై నిలిచి తళతళా మెరిసిపోతున్నాయి. ఆ నీటిలో తమ నీడలు చూసుకుంటూ మురిసిపోతున్నాయి పిల్ల మబ్బులు. చేలన్నీ పైరగాలితో ఆడుకుంటూ పరవశంగా ఊగిపోతున్నాయి. కందిచేను సాళ్ల మధ్య ఒంటరిగా గడ్డి కోస్తూ పుట్టెడు దుఃఖాన్ని వలపోస్తోంది పూలమ్మ.

‘‘జజ్జనక జజ్జనం ...జజ్జనక జజ్జనం ... ’’డప్పుల చప్పుడు ఊరంతా బతకమ్మ పండగ సందడి తెస్తుంటే పూలమ్మకు మాత్రం చెప్పలేని దుఃఖం వస్తోంది.నానిపోయిన నేల మీద గడ్డి కోయటం చానా కష్టంగా ఉంది. కొడవలితో గడ్డి కోస్తుంటే వేర్లతో సహా మట్టి కూడా లేచి పైకి వస్తోంది. అందుకనే రోజుకంటే తక్కువ గడ్డి కోసింది పూలమ్మ. వాళ్ల అత్త ఇయన్నీ పట్టించుకోదు. ఇటు గడ్డి మోపు ఏ మాత్రం తగ్గినా, అటు పొద్దు పోయినా నోరు సంకన పెట్టి అనరాని మాటలంటది.గడ్డి మందంగా ఉన్న చోటు కోసం కంది చేను సాళ్ల మధ్య దేవులాడింది పూలమ్మ. ఓ చోట వెన్నెముద్దలల్లం గడ్డి ఒత్తుగా కనపడ్డది. సాలు మొత్తం గడ్డి కోసి, మోపు కట్టడానికి కమ్మాకుల కోసం చేను గెట్టు దగ్గర ఉన్న తాటి చెట్టుకాడికి పోయింది.చెట్టు పక్కన వరుసగా తంగేడు చెట్లు. బంగారు పూలు పూసినట్లు మెరిసిపోతున్న తంగేడు పూలు. అయినా, ఆ పూలు చూడగానే పూలమ్మ ఒళ్లు పులకరించలేదు.

పసిపాపల బుగ్గల్లాంటి ఆ పూల రెమ్మలను సుతారంగా తాకాలనిపించలేదు. పూలను చూసి కళ్లనిండా నీళ్లు తెచ్చుకుంది. ఆ తంగేడు చెట్టు కిందనే కూలబడి అశోక వనంలో సీతలా కుమిలిపోయింది.ఫ ఫ ఫపొద్దు పోయి ఇంటికి పోతే అత్త తిడ్తదన్న సంగతి యాదికి రాగానే లేచి తాటాకులు కోసింది. చీరింది. తాళ్లు చేసింది. గడ్డి మోపు కట్టింది. ఎత్తుకోవడానికి పైకి లేపితే లేవలేదు. వానకు తడిసిన గడ్డి బరువు ఎక్కువయ్యింది. ఎవలనన్నా పిలుద్దామని అటూ ఇటూ చూసింది. ఎవలూ కనబడలేదు. మళ్లొక్కసారి ఒంట్లోని పాణమంతా కూడ బట్టి గట్టిగా ఉపకాయించి పైకి లేపింది. ఆ బలానికి గడ్డిమోపు భుజం మీదికి వచ్చింది. కానీ ఒక్కసారిగా పొట్టల పేగులు కదిలినయి.