పూర్వం ఒక రాజు తన రాజ్యాన్ని చాలా తెలివిగా పాలిస్తూ ఉండేవాడు. వృద్ధాప్యంతో మరణశయ్యపైకి చేరిన ఆ రాజు.. తన కొడుకును పిలిచి- ‘మా నాన్నకు ముగ్గురు పిల్లలు. నేను చిన్నవాడిని. మిగిలినవాళ్లను కాదని నాకు రాజ్యాన్ని కట్టబెట్టడానికి కారణం- నాకు నా మీద సంపూర్ణమైన నియంత్రణ ఉందని ఆయన నమ్మడమే. నువ్వు కూడా అలాంటి నియంత్రణ సాధించగల్గితే ఈ రాజ్యాన్ని నీకు ఇస్తాను. లేకపోతే తెలివైన వాడిని ఎంపిక చేసి అతనికి అప్పగిస్తా..’ అన్నాడు.అప్పుడా యువరాజు ‘నేను రాజ్యాన్ని పాలించటానికి అవసరమైన విద్యలన్నీ నేర్చుకున్నా. కానీ ఈ నియంత్రణ గురించి ఎవరూ చెప్పలేదు. దానిని ఎలా అభ్యసించాలో చెబితే.. వెళ్లి నేర్చుకొని వస్తాన’ని బదులిచ్చాడు.దానికా మహారాజు ‘నాకు విద్య నేర్పిన గురువు దగ్గరకు నిన్ను పంపుతాను. కానీ శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. దాన్ని తట్టుకు నిలబడగలిగితేనే నీకు రాజ్యం లభిస్తుంది’ అని హెచ్చరించి, అతనిని తన గురువు దగ్గరకు పంపాడు.

ఆ గురువు కురువృద్ధుడు. యువరాజును చూసి ‘మీ నాన్న బాగా తెలివైనవాడు. అందుకే రాజ్యం దక్కింది. నేను నీకు మూడు పరీక్షలు పెడతాను. వాటిలో నెగ్గితే, నీకు రాజ్యార్హత ఉన్నట్లే. రేపటి నుంచి నువ్వు వంటింటిని శుభ్రం చేయి. నేను నిన్ను వెనక నుంచి నా చేతి కర్రతో కొడుతూ ఉంటాను. నువ్వు ఎప్పుడైతే ఆ కర్ర దెబ్బల నుంచి తప్పించుకుంటావో అప్పుడు నువ్వు మొదటి పరీక్షలో నెగ్గినట్లే..’ అన్నాడు.ఆ మర్నాటి నుంచి యువరాజు వంటింటిని శుభ్రం చేయటం మొదలుపెట్టాడు. ఊహించని సమయంలో గురువుగారు వచ్చి కర్రతో యువరాజును కొడుతూ ఉండేవాడు. మొదట్లో యువరాజు దెబ్బలు తింటూ ఉండేవాడు. పదిహేను రోజులు పోయేసరికి యువరాజు గురువుగారి రాకను పసిగట్టడం మొదలుపెట్టాడు. ఒక రోజు.. గురువుగారు కొట్టడానికి కర్ర ఎత్తిన వెంటనే చేతితో పట్టుకున్నాడు. ‘శభాష్‌! మీ తండ్రిలాగానే నువ్వు కూడా తొలి పరీక్షలో సునాయాసంగా నెగ్గావు. ఇక రేపటి నుంచి రెండో పరీక్ష పెడతాను. నువ్వు నిద్రపోతున్న సమయంలో వచ్చి నిన్ను కర్రతో కొడతాను. ఎప్పుడైతే నువ్వు నా కర్రదెబ్బలు తప్పించుకుంటావో.. అప్పుడు నువ్వు రెండో పరీక్షలో నెగ్గినట్లే..’ అన్నాడు.